‘అంబా’లెన్స్..!
♦ పశు అంబులెన్స్‌ల కేటాయింపు ఇలా..
♦ ఖమ్మం జిల్లా ,ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు
♦ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
♦ కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట
పాల్వంచరూరల్ : మనుషులకు అత్యవసర సేవలు అందాలంటే..108కు ఫోన్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ కుయ్..కుయ్‌మంటూ వస్తుంది. అదే తరహాలో పశువులకు సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 1962నంబర్‌కు ఫోన్ చేస్తే సంచార వైద్యశాల గ్రామాలకు రానుంది. అందులోని పశువైద్యసిబ్బంది పశువులు, గొర్రెలు, మేకలకు చికిత్స చేసి, రైతులు, పెంపకందారులకు మందులు ఇచ్చి వెళతారు. ఈ సంచార వైద్యశాల(అంబులెన్స్) వాహనాలు త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చేరనున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు మైరుగైన వైద్యం అందించడమే వీటి లక్ష్యం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెండు జిల్లాల పరిధిలో 10 వాహనాలు రానున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పశువుల అంబులెన్స్ వాహనాన్ని పరిశీలించి, 1962 నంబర్‌కు ఫోన్ చేసి..కాల్ సెంటర్ పనితీరును ప్రశంసించడంతో..సంచార వైద్యసేవలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.
రెండు జిల్లాలో పశుసంపద ఇలా..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొత్తం 80 పశువైద్యశాలలు, 44 గ్రామీణ వైద్యశాలలు, 30 ప్రాథమిక వైద్యశాలలు, 6 గ్రేడ్–1 స్ధాయి పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 14,67,126 పశువులు ఉన్నాయి. గేదెలు 1,92,376, గొర్రెలు 1,04,288, మేకలు 2,25,171, కోళ్లు 7,12,546 ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో తెల్లపశువులు మొత్తం 1,44,710, గేదెలు 3,58,251, గొర్రెలు 3,12,607, మేకలు 1,60,276 ఉన్నా యి. వీటికి ఏదైనా జబ్బు సోకినా, అత్యవసర వైద్యం కావాల్సి వచ్చినా..1962కు ఫోన్ చేస్తే పశువైద్యసేవల అంబులెన్స్ ఆ ఊరికి రానుంది.
రైతులకు ఎంతో మేలు..
పశు సంచార వైద్యానికి కొత్తగా వాహనాలను కేటాయించడం ఎంతో సంతోషం. పశువైద్యానికి అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. రైతులు ఫోన్ చేయగానే వారి ఊరికి పోయి..పశువైద్య సిబ్బంది మూగ జీవాలకు చికిత్స అందిస్తారు. పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చే స్థితిలో లేని వారికి ఇది ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా పశువైద్యసేవలు అందనున్నాయి. పశువుల వద్దకే వైద్యం రావడం మంచి పరిణామం.
–డాక్టర్ వేణుగోపాల్‌రావు, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం