శాసనసభ సమావేశాల చివరిరోజున సభలో ఉన్న సభ్యులందరికీ జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం దక్కింది.
♦ శాసనసభ సమావేశాల చివరి రోజున పలు అంశాలను ప్రస్తావించిన సభ్యులు
♦ టీ బ్రేక్ కూడా లేకుండా ఏకధాటిగా జరిగిన సభ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల చివరిరోజున సభలో ఉన్న సభ్యులందరికీ జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం దక్కింది. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత స్పీకర్ మధుసూధనాచారి గంట సమయం జీరో అవర్ కోసం కేటాయించారు. టీ బ్రేక్ సైతం ఇవ్వకుండా ఉదయం 10గంటల నుంచి ఒకటిన్నర వరకు సభను నిరాటంకంగా నడిపించారు. 50 మంది సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, ఇతరత్రా అంశాలను ప్రస్తావించారు. ఎవరెవరూ ఏం మాట్లాడారంటే..
‘చార్మినార్ ప్రాంతంలో మద్యం దుకాణాలు మందిరాలకు, పాఠశాలలకు దగ్గరగా ఏర్పాటు చేశారు. ఇది నిబంధనల ఉల్లంఘనే. దుకాణాలకు అనుమతులు ఇచ్చినప్పుడే ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకునేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలివ్వాలి.. వాటిని దూరంగా పెట్టించాలి’ - అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే
‘హైదరాబాద్ చుట్టుపక్కల అనధికార లేఅవుట్‌లు చాలా ఉన్నాయి. వాటిల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. లేఅవుట్‌ల పేరిట ఆక్రమించిన భూ వివరాలను ప్రభుత్వం సేకరించాలి’
-శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే
‘హైదరాబాద్‌లో పారిశుధ్యం లోపించింది. డ్రైనేజీలన్నీ నిండిపోయి మురుగు రోడ్లపైకి వస్తోంది. పారిశుధ్య వాహనాలన్నీ పాతవైపోయాయి. వాటి స్థానంలో కొత్తవాటిని తెచ్చి పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేయండి’
- ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం ఎమ్మెల్యే
‘బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి రైతులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయండి’
- చిన్నయ్య, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
‘రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ఆశ వర్కర్లకి అండగా నిలవండి. కేంద్రం నుంచి వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా చూడండి’
-తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే
‘మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రం చేయాలి. జిల్లా కేంద్రంగా చేయాల్సిన అన్ని రకాల అర్హతలు దీనికి ఉన్నాయి’
-శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎమ్మెల్యేలు
‘జూరాల నుంచి కింద కోయిల్‌సాగర్‌కు నీరివ్వడంలో జాప్యం జరిగింది. రెండో మోటార్‌ను ఆరంభించి కోయిల్‌సాగర్‌ను నింపండి’
- ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే