ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తామన్న ప్రభుత్వం
నేటికీ వాటి ఊసే లేని వైనం
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కూలీలు
గుంటూరు : రాజధాని ప్రాంతంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా రూ .5కే భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఎంపిక చేసిన ఒకటీ, రెండు గ్రామాల్లో ప్రారంభించి..ఆ తర్వాత విస్తరించనున్నట్లు చెప్పింది. హైదరాబాద్‌లోని అక్షయపాత్ర సంస్థకు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నట్లు అధికార పార్టీకి చెందిన నాయకులు చెబుతూ వచ్చారు. కానీ ఇంత వరకు దానికి సంబంధించిన పనులుగానీ, మార్గదర్శకాలుగానీ చేపట్టలేదు.
రాజధాని ప్రాంతంలో అధిక సంఖ్యలో కూలీలు
రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ రంగం విస్తరిస్తుండటంతో కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరు భోజనానికి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని వారంతా భావిస్తున్నారు.
ప్రభుత్వం మాటలపై నమ్మకం లేదు
రాజధాని ప్రకటన సందర్భంలో ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజానీకానికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పింది. ఉచిత వైద్యం, పిల్లలకు విద్య అందిస్తామని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడంతో రైతులు, రైతు కూలీలు, ఇతర వ్యవసాయ అనుబంధ వృత్తుల వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలు చూపుతామని హామీ ఇచ్చింది. వీటిలో ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది.
రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానందున ఇప్పుడే క్యాంటీన్ల ఏర్పాటు అవసరం లేదని అధికార పార్టీ నాయకుడొకరు చెప్పారు. రాజధాని నిర్మాణం మొదలైతేనే వాటిని ప్రభుత్వం క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ప్రైవేటుగా అనేక భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కూలీలు అధిక సంఖ్యలో వస్తున్నారు. వీరందరూ ఎన్టీఆర్ క్యాంటీన్లు కావాలని కోరుతున్నారు. మరి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేదెప్పుడో ? క్యాంటీన్లు ఏర్పాటు చేసేదెప్పుడో ? అని వారు పెదవి విరుస్తున్నారు.
అన్న క్యాంటీన్లు ఎక్కడ?
Published Fri, Dec 25 2015 8:55 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement