మద్యంపై యుద్ధం | Anti-liquor movement in the district | Sakshi
Sakshi News home page

మద్యంపై యుద్ధం

Published Wed, Jul 5 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

మహిళలపై దాడికి దిగిన మద్యం దుకాణం నిర్వాహకులు

మహిళలపై దాడికి దిగిన మద్యం దుకాణం నిర్వాహకులు

జనావాసాల్లో మద్యం దుకాణాలా..?
మండిపడుతున్న మహిళా లోకం
జిల్లాలో మిన్నంటుతున్న ఆందోళనలు
పలుచోట్ల దుకాణాలు ధ్వసం
జిల్లా మేజర్‌ రోడ్ల పేరుతో సర్కారు కొత్త ఎత్తుగడ
వ్యాపారులకు కొమ్ముకాసేలా జీవో విడుదల


జిల్లాలో మద్య వ్యతిరేక ఉద్యమం జోరందుకుంది. రోడ్లను వదిలి జనావాసాల్లోకి వస్తున్న మద్యం దుకాణాలపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. పేదల బతుకుల్లో మద్యం మహమ్మారి చిచ్చు పెడుతోందంటూ మహిళలు ఆందోళనలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. మద్యం మహమ్మారిని తరిమి కొట్టండంటూ దుకాణాలను ధ్వంసం చేస్తున్నారు. మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో సర్కారు దిగొచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రీయ రహదారులుగా ఉన్న వాటిని జిల్లా మేజర్‌ రోడ్లుగా మార్పు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. మద్యం వ్యాపారులకు కొమ్ము  కాసేలా ఉన్న ఈ ఉత్వర్వులతో అధికశాతం మద్యం షాపులు యథాస్థానాల్లోనే కొనసాగనున్నాయి.

ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లాలో మొత్తం 331 మద్యం షాపులున్నాయి. 33 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. 331 మద్యం షాపుల్లో జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులపై ఉన్న 165 మద్యం షాపులు జనావాస ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. మద్యం షాపులు  వద్దంటూ ఒంగోలుతో పాటు కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ మహిళలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మధ్యం దుకాణాలను రాష్ట్రీయæ, జాతీయ రహదారులకు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలకు 500 మీటర్ల దూరంలో ఉండాలని తీర్పు చెప్పటంతో తొలుత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ తీసేయటంతో అవికాస్తా జనావాసాల్లోకి రావటంతో మహిళలు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. నిర్వాహకులు మరో మూడు నెలలు గడువు కోరడంతో ఇచ్చారు. ఆ తరువాత జూన్‌ 30 వరకు గడువు ఇచ్చి అప్పటికీ పూర్తిగా నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ రావటంతో ప్రజలకు అసలు విషయం అర్ధం కాలేదు.

సర్కారు కొత్త జీవో..
మద్యం మహమ్మారిపై జిల్లావ్యాప్తంగా మహిళల నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రీయ రహదారులను జిల్లా మేజర్‌ రోడ్లుగా మార్పులు చేస్తూ కేవలం మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు పూర్తి స్థాయి అవకాశం కల్పించింది. మంగళవారం జీవో ఎంఎస్‌ నెం.28ని విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మార్చి 15న ప్రభుత్వం ఇచ్చిన మెమో ఆధారంగా జీవోను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. 75 శాతంకుపైగా మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు యథాతథ స్థానాల్లోనే ఉండేలా ఇచ్చిన ఉత్తర్వులతో ఈ ప్రభుత్వం మద్యం వ్యాపారులకు కొమ్ముకాస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఒంగోలు నగరంలో అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌ మొదలుకొని, బస్టాండ్‌ సెంటర్‌కు ఇరువైపుల ఉన్న అన్ని బార్లు, మద్యం షాపులు మూతేశారు. కొత్త జీవోతో మళ్లీ అవన్నీ రానున్నాయి. ఒక్క కర్నూలురోడ్డు బైపాస్, మంగమూరురోడ్డు బైపాస్‌ జంక్షన్లలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం షాపులు మాత్రం 500 మీటర్లు అవతలకు వెళ్ళాల్సి ఉంది. ఇక పోతే జాతీయ రహదారులు జిల్లాలో రెండున్నాయి. ఒకటి చెన్నై–కోల్‌కత్తా 16వ నంబర్‌ జాతీయ రహదారి, రెండోది చీరాల జాతీయ రహదారి. ఈ రెండు రోడ్ల వెంట ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం షాపులు 500 మీటర్లు అవతలకు కచ్చితంగా వెళ్లాల్సి ఉంది.

జాతీయ రహదారులపై ఉన్న మండల కేంద్రాలు, ఒంగోలు నగరం, మున్సిపాలిటీల్లో ఉన్న బైపాస్‌ల్లో షాపులు మాత్రమే నిబంధనల ప్రకారం తీసివేయాలి. పట్టణాల్లోకి, మండల కేంద్రాల్లోకి వచ్చే రోడ్ల వెంట మాత్రం యథాతథంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం షాపులు ఉండవచ్చు. మొత్తం మీద పాత సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 165 మద్యం షాపులు, 19 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు రోడ్లపై లేకుండా వెళ్లాల్సి ఉంటే, ఇప్పుడవి కేవలం 6 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, 30 నుంచి 40 మధ్యలో మద్యం షాపులు మాత్రమే జాతీయ రహదారులపై నుంచి 500 మీటర్లకు వెళ్లనున్నాయి.  

కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్న  దుకాణ విషయంలో స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. రాస్తారోకో కూడా నిర్వహించారు.

తాళ్లూరు మండలంలో బొద్దికూరపాడు బస్టాండ్‌ రోడ్‌లో ప్రాథమిక పాఠశాల పక్కన దుకాణం ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. ఇలా దుకాణాలను అడ్డుకోవడంతో అక్కడి స్టాకు బెల్ట్‌లకు చేరింది. దర్శి నియోజక వర్గంలో దాదాపు 225 బెల్ట్‌దుకాణాలను పైగా ఉన్నాయి.

గిద్దలూరు రాజానగర్‌ వాసులు, మండలంలోని ముండ్లపాడు గ్రామస్థులు, బేస్తవారిపేటలోని వాల్మీకినగర్‌వాసులు, కంభంలోనూ మధ్యం దుకాణాల ఏర్పాటుపై ఆందోళనలు చేశారు.

కందుకూరు నియోజకవర్గంలో మందుబాబుల ఆగడాలను ఎలా ఉంటాయో గుర్తించిన మహిళలు వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

శింగరాయకొండలో జాలమ్మగుడి వద్ద ఏర్పాటు చే స్తున్న మద్యం షాపును వద్దని ఆప్రాంత వాసులు మహిళలు శింగరాయకొండ ఎక్త్సెజ్‌శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపి సీఐకి వినతి పత్రం అందించారు.

జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయనివ్వమని గ్రామ సర్పంచ్‌ సునీత, మాజీ సర్పంచ్‌ మనోహర్‌తో పాటు గ్రామస్ధులు ఎక్త్సెజ్‌ అధికారులకు తెగేసి చెప్పారు. కాదని ఏర్పాటు చేస్తే ప్రతిఘటిస్తామన్నారు.  

కనిగిరి ప్రాంతంలో మద్యం నూతన షాపులను నివాసాల మధ్య ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల మహిళలు, ప్రజలు, స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. అనేక చోట్ల అడ్డుకోగా, ఒకట్రెండు చోట్ల షాపులను గోడలను పగుల కొట్టారు.

మార్కాపురం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు, స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దంటూ నిరసనల హోరు కొనసాగుతోంది.

మద్దిపాడు మండలం బూరేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు, స్థానికులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను గ్రీవెన్స్‌లో కలిసి వినతిపత్రం అందించి మద్యం దుకాణాన్ని తొలగించాలని విన్నవించారు.

చీమకుర్తిలోని లిటిల్‌స్టార్‌ హైస్కూలుకు సమీపంలో గాంధీనగర్‌లో ఉన్న మద్యం దుకాణం మీదుగా విద్యార్థుల రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉందని విద్యార్థులు ఎక్సయిజ్‌ అధికారులకు వినతిపత్రం అందించి మధ్యం దుకాణాన్ని తొలగించాలని విన్నవించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement