కనువిందుగా కళాబృందాల ప్రదర్శన
భారీగా సామాజిక పరివర్తన ర్యాలీ
తెనాలి: సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ 7వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం సామాజిక పరివర్తన ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోనిS రైల్వేస్టేషను సెంటరు నుంచి ర్యాలీ ఆరంభించారు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆ సెంటరులోని భగత్‌సింగ్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ్నుంచి ప్రదర్శన రణరంగచౌక్‌కు చేరుకోగానే పార్టీ నేతలతో కలిసి అక్కడి అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు.
మార్కెట్ సెంటర్, మెయిన్‌రోడ్డు, బోసురోడ్డు నుంచి ప్రదర్శన బహిరంగసభావేదికైన నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంకు చేరుకొంది. ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి తరలించ్చిన పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు, 13 జిల్లాల్నుంచి ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ప్రదర్శనకు ముందుభాగాన తప్పెటగుళ్లు, మహిళల డబ్బు వాయిద్యబృందం, మహిళల కోలాంటి, గిరిజన నృత్యాలు కనువిందుగా సాగాయి. కార్యకర్తలు, కళాకారులు ఎరుపు దుస్తుల్లో, ఎర్ర జెండాలు పట్టుకుని క్రమశిక్షణగా ప్రదర్శనలో సాగటం, కళాబృందాల సందడి పట్టణవాసుల్ని ఆకర్షించాయి. మహాసభల వేదికపైనా ఆంధ్రప్రదేశ్ జనసంస్కృతిక మండలి కళాకారులు అద్భుతంగా విప్లవ పాటలకు అభినయించారు. వీరిలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడుకు చెందిన నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల మద్దెల దిలీప్ చేసిన అభినయం ఆకట్టుకుంది.