మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో కర్ణన్
-
ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్
-
ఉట్నూర్ ఆశ కార్యకర్తల సమ్మేళనం
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు అరికట్టడంలో ఆశ కార్యకర్తలు నిర్వర్తించే పాత్ర కీలకమైనదని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ అన్నారు. వర్షకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలుతున్నందున్న ఎల్లప్పుడు ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మండల కేంద్రంలోని హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆశ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలినప్పుడు వెంటనే సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రాథమిక చికిత్స అందించాలని చెప్పారు.
గిరిజన గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ పారిశుధ్యం లోపించకుండా తీసుకోవాల్సిన చర్యలు, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు వివరించాలని పేర్కొన్నారు. గర్భిణులు ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో దోమల నివారణకు కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా వీటీడీఏ, ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో స్ప్రే చేయిస్తామని, అందుకు సంబంధించిన నిధులు ఆశ కార్యకర్తల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
జ్వరాలు ప్రబలితే ఆర్డీ కీట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించేలా చర్యలు చేపడితే రూ.50 ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది ఆశ కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆశరెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఏఎమ్‌వో వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.