గన్నవరం : అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. గురువారం గన్నవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా రావాలంటే ముందు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరగాలన్నారు.
కేంద్రమంత్రికి చేదు అనుభవం
భవానీపురం : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. అయితే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు.
భూసేకరణపై చర్చలు
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ భూసేకరణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పలువురు రైతులు చర్చించారు. రైతులకు నష్టం లేకుండా భూసేకరణ చేపట్టేందుకు వీలుగా ఏలూరు కాలువ మళ్లింపు డిజైన్‌ను మార్పు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, డిజైన్ మార్పు విషయమై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ పంపుతామని తెలిపారు.
రాష్ట్రాభివృద్దికి సీఎం కృషి
రావిచర్ల: రాష్ట్రవిభజన జరిగి రాష్ట్రం అష్టకష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. నూజివీడు మండలంలోని రావిచర్ల క్రాస్‌రోడ్డు వద్ద మామిడి తోటలో పుష్కరయాత్రికుల సౌకర్యార్థం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో కలిసి గురువారం కేంద్రమంత్రి సందర్శించారు.
ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ రాజకీయ విలువల కోసం ప్రభుత్వం, పార్టీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కర యాత్రికుల కోసం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.