పున్నమిఘాట్‌లో వైఎస్ జగన్ పుష్కరస్నానం
విజయవాడ: వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, రక్షణనిధి, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గన్నవరం నుంచి నేరుగా పున్నమిఘాట్‌లో ఉన్న వీఐపీ ఘాట్‌కు వైఎస్ జగన్ చేరుకుని పుష్కర స్నానమాచరించి, పిండ ప్రదానం చేశారు. పుష్కర స్నానానికి ముందు జగన్.. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత లబ్బిపేటలోని షిరిడీసాయిని దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుష్కర స్నానం అనంతరం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.