భవిత తేలేనా ..
కసరస్తు చేస్తున్న సర్కారు
అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని యోచన
రెండుమూడు రోజుల్లో రైతులతో మంత్రి కేటీఆర్ బేటీకి అవకాశం
బోధన్ : బోధన్‌లోని నిజాంషుగర్స్ భవిత ను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే తుది నిర్ణయంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు నిజాంషుగర్స్ పరిధిలోని నియోజక వర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు సమాచారం. ఫ్యాక్టరీ పరిధిలోని ముఖ్యమైన చెరుకు రైతుల నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రైతులతో కీలక సమావేశం జరుగనుందని సంకేతాలు వస్తున్నాయి. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికార పక్ష నేతలు, రైతు నాయకులు అంటున్నారు. వారం రోజుల్లో పే ఫ్యాక్టరీ భవిత తేలుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా టీఆర్‌ఎస్ ఎన్నికల అజెండాలో ముఖ్యమైన అంశంగా నిజాంషుగర్ ఫ్యాక్టరీ సమస్య ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సభల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచి పోయినా ప్యాక్టరీ భవితను తేల్చడంలో విధాన పరంగా స్పష్టత ఇవ్వలేదు. 2015 డిసెంబర్ 23న నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) యాజమాన్యం చెరుకు, నీటి లభ్యత కొరత కారణాలు చూపి లేఆఫ్ ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఎన్‌డీఎస్‌ఎల్‌తో పాటు జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లను మూసివేసింది. ముఖ్య వ్యవసాయాధార పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీల మూసివేతతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఫ్యాక్టరీలు మూసివేసి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పునరుద్ధరణకు స్పష్టత ఇవ్వలేదు.మూడు ఫ్యాక్టరీల మూసివేతతో వందలాది మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. చెరుకు పంట సాగు చేసిన రైతులు జిల్లాలోని ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు చెరుకును మళ్లించారు. అఖిల పక్షాలు, కార్మిక ,రైతు సంఘాలు, నిజాంషుగర్స్ రక్షణ కమిటీల నేతృత్వంలో బోధన్‌లో 10 నెలలకు పైగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో బోధన్ నియోజక వర్గం పరిధిలోని నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర చేపట్టారు.
2015 జనవరి 5న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మూడు ఫ్యాక్టరీల పరిధిలో చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. రైతులు ముందుకువస్తే ఫ్యాక్టరీని ఆధునీకరించి అప్పగిస్తామని అన్నారు. అయితే ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపాలని రైతులు స్పష్టం చేశారు. 20 రోజుల క్రితం ఎంపీ కల్వకుంట్ల కవిత రైతులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వం కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది