’అటవీ’ ఆట.. వాళ్లది కాదట
కూచింపూడి అటవీ ప్రాంతంపై మాఫియా పంజా విసిరింది. అడవిలోగల వెదురు గడలు, యూకలిప్టస్ కలపను యథేచ్ఛగా నరికి దొంగిలించుకుపోతున్నారు. రవాణా కోసం హైవేను తలపించేలా రోడ్డు నిర్మించడంతోపాటు వెదురు పొదల మధ్య అంతర్గత రహదారులూ నిర్మించారు. ఈ విషయాలన్నీ అటవీ శాఖలో అందరికీ తెలుసు. అయినా ఎవరూ నోరుమెదపటం లేదు.
కూచింపూడి అడవిలో కలప దోపిడీపై నోరు మెదపని అధికారులు
అటవీ ప్రాంతం తమది కాదంటున్న అధికారులు
మాఫియా వెనుక టీడీపీ పెద్దలు !
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
కూచింపూడి అటవీ ప్రాంతంపై మాఫియా పంజా విసిరింది. అడవిలోగల వెదురు గడలు, యూకలిప్టస్ కలపను యథేచ్ఛగా నరికి దొంగిలించుకుపోతున్నారు. రవాణా కోసం హైవేను తలపించేలా రోడ్డు నిర్మించడంతోపాటు వెదురు పొదల మధ్య అంతర్గత రహదారులూ నిర్మించారు. ఈ విషయాలన్నీ అటవీ శాఖలో అందరికీ తెలుసు. అయినా ఎవరూ నోరుమెదపటం లేదు. అక్కడ సాగుతున్న బాగోతాన్ని ’అరణ్య రోదన’ శీర్షికన ఈనెల 2వ తేదీన ’సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అటవీ శాఖలో కలకలం రేగింది. ఈ వ్యవహారం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉండటంతో అధికారులు నోరుమెదపడం లేదు. పెదవేగి మండలం న్యాయంపల్లి, కూచింపూడి గ్రామాల పరిధిలోని 6,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ఎవరి పరిధిలో ఉందో తెలియని స్థితిలో యంత్రాంగం ఉండటం జిల్లాలోని అడవుల దుస్థితికి అద్దం పడుతోంది. అక్కడ సాగుతున్న అక్రమాలపై ’సాక్షి’ వివరణ కోరగా అటవీ శాఖ అధికారులకు తమకేమీ తెలియదంటూనే.. ఈ విషయాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులకు చేరవేయడం, వారు వెంటనే రంగంలోకి దిగటం చూస్తుంటే ఈ దోపిడీ వెనుక ఎవరు ఉన్నారనే విషయం అర్థమవుతోంది.
ఆ అడవి ఎవరిదీ కాదట
నరికివేతకు గురవుతున్న కూచింపూడి అటవీ ప్రాంతం ఎవరి పరిధిలోకి వస్తుందన్న అంశంపై ఆ శాఖ అధికారులు, ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. తమ శాఖలో జరుగుతున్న అక్రమాలు తమకు తెలియదంటూ నెపాన్ని ఇతర శాఖలపై నెట్టేస్తున్నారు. అక్కడ సాగుతున్న అక్రమాలపై డివిజనల్ అటవీ శాఖ అధికారి ఎన్.నాగేశ్వరరావును ’సాక్షి’ వివరణ కోరగా పెదవేగి మండలం కూచింపూడి పరిసరాల్లో అటవీ భూముల్లో విలువైన సంపదను దోచుకుంటున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ ప్రాంతంలో కొంత అటవీ భూమిని ప్రభుత్వం ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించిందన్నారు. కార్పొరేషన్ అధికారులు వెదురు చెట్ల పెంపకం, అమ్మకాలు చేపట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అటవీ భూముల్లో హైవేను తలపించేలా రోడ్డు వేసిన విషయం తన దృష్టికి రాలేదని, ఆ ప్రాంతాన్ని సందర్శించి విచారణ జరుపుతామని సెలవిచ్చారు. ఇదే విషయమై ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ సరస్వతిరావును వివరణ కోరగా.. పెదవేగి ప్రాంతంలో తమ కార్పొరేషన్‌కు అటవీ భూములు లేవన్నారు. జిల్లాలో ఒక్క నల్లజర్ల పరిసరాల్లోని అటవీ భూముల్లో మాత్రమే మొక్కలు పెంపకం చేపట్టామని వివరించారు. కూచింపూడిలో వెదురు మొక్కల పెంపకం చేయడం లేదని, అక్కడ జరుగుతున్న తంతుకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు, అటవీ శాఖ అధికారులు, ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతంలోని అడవి, అక్కడి వ్యవహారాలతో తమకెలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ అడవి ఎవరికి చెందుతుంది. బాధ్యులు ఎవరన్న సందేహాలు వ్యక్తమవుతన్నాయి. ఈ తతంగం వెనుక అధికార పార్టీకి చెందిన పెద్ద నేతల హస్తం ఉండటంతో అటవీ శాఖ అధికారులు మౌనంగా ఉంటున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈ అంశంపై హైకోర్టులో పిల్ వేయనున్నటేకట లోక్ జనశక్తి పార్టీ నేత ఎల్.నాగబాబు సాక్షికి తెలిపారు.