ప్రజాక్షేత్రంలో బాబుకు ఓటమి తప్పదు
– పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం
– గోపాల్‌రెడ్డి విజయంతో సంబరాలు
– కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌న కైవాసం చేసుకుంటామని ధీమా
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అధికార బలం, డబ్బు, దౌర్జన్యాలతో ప్రజాతీర్పును అడ్డుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హెచ్చరించారు. పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, కడప, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారన్నారు. అదే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్ని కోట్లు గుమ్మరించి ఓటర్లను కొనాలని చూసినా ఓటమి తప్పలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే తెలియజేశాయన్నారు.
2019 ఎన్నికల్లో విజయం తథ్యం
తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే 2019 ఎన్నికల్లో విజయం తథ్యమని, తద్వారా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖామన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నికల్లో మూడు స్థానాల కోసం 300 కోట్లను ఖర్చు చేయలేదన్నారు.
కర్నూలు మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తెలిపారు. వెంటనే కేఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, నాయకులు జహీర్ అహ్మద్‌ఖాన్, సత్యం యాదవ్, స్వరూప్‌కుమార్, రసూల్‌ఖాన్, నురుల్లాఖాద్రీ, హెచ్‌ఏ రహిమాన్, షబ్బీర్, ఫిరోజ్, రామకృష్ణ, ఈశ్వర్, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.