కంప్యూటర్ విద్యకు మంగళం!
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు గడ్డు కాలం రానుంది. ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి, బోధించే కాంట్రాక్ట్ నేటి(జూలై 31)తో పూర్తి కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,031 ప్రాజెక్టులకు మళ్లీ టెండర్లు పిలి చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కంప్యూటర్ విద్యను బోధిస్తున్న 8వేల మంది ఇన్‌స్ట్రక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై 4 వేల స్కూళ్లలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పథకాన్ని 2002లో అరకొర ఏర్పాట్ల మధ్య ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. కంప్యూటర్ల కోసం ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షలు వెచ్చించారు. తాజాగా టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్ట్ ఖరారు చేయడమో లేదా పొడిగించడమో చేయని పక్షంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కంప్యూటర్ కేంద్రాలు మూత పడడం ఖాయం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పథకం అమలుకు రాష్ట్రం 30 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. మిగతా 70 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. పథకం పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రానిదే. టెండర్లు పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదిస్తే 70 శాతం నిధులు లభిస్తాయి. మిగతా 30 శాతం నిధులు సర్దుబాటు చేయడానికి ఇష్టంలేని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రతిపాదనలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ తీరుపై ఇన్‌స్ట్రక్టర్లు మండిపడుతున్నారు. కంప్యూటర్ విద్య పథకాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్వహించడం మేలని కొందరు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.