ఎండలకు ఆకుల్లా రాలుతున్న గబ్బిలాలు
చెట్లపైకి పైప్‌తో నీళ్లు కొడుతున్న గ్రామస్తులు
కేసముద్రం(మహబూబాబాద్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ఎటు చూసినా గబ్బిలాలే దర్శనమిస్తాయి. ఈ వేసవిలో ఎండ తీవ్రత పెరగడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానికులు వాటిని కాపాడేందుకు చెట్లపై నీళ్లు చల్లుతూ వాటికి ఉపశమనం కలిగిస్తున్నారు.
గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపం లోని చెట్లపైనున్న గబ్బిలాలు వడ గాడ్పులకు మృత్యువాత పడుతున్నాయి. దీంతో సర్పంచ్ బాలునాయక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధ వారం వ్యవసాయ బావికి మోటారు పెట్టించి పైపుల ద్వారా చెట్ల మీదున్న గబ్బిలాలకు నీళ్లు కొట్టి గబ్బిలాలను బతికించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వీస్తున్న వడగాడ్పులకు 14 మంది మృతి చెందారు. అందులో 12 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే మరణించారు. మృతుల్లో కరీంనగర్ జిల్లా రాచపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల రామయ్య (64), మానకొండూర్ మండలంలోని ముం జంపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు పిల్లి రవి (38) కూడా ఉన్నారు.