
లింగమయ్య కాలనీ
పటాన్‌చెరు: బీరంగూడలోని అనేక కాలనీల్లో రోడ్లపై వరదనీరు పొంగిపోర్లింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం కాగా అనేక కాలనీల్లో జనజీవనం కొద్దిసేపు స్తంభించిపోయిందనే చెప్పాలి. మంగళవారం రాత్రి నుంచి వర్షం కురిసింది. అయితే ఉదయం గంటపాటు కుండపోత వర్షం పడింది.
దాంతో అమీన్‌పూర్ ప్రాంతంమంతటా లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతొ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. బీరంగూడలోని సాయికాలనీ. సాయిబగవాన్ కాలనీలో రోడ్లపై రెండు, మూడు అడుగుల లోతు నీరు పొంగిపోర్లింది. రోడ్లన్నీ వరదనీటితో నిండిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది.
బీరంగూడ గుట్ట కింది భాగంలో ఉన్న కాలనీల్లోని అపార్టుమెంట్లలోని సెల్లార్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. పార్కుచేసి ఉన్న కార్లు ఇతర వాహానాలను బయటకు తీయలేక చాలా మంది కార్మికులు విధులకు వెళ్లలేకపోయారు. ఆయా కాలనీలకు వచ్చి వెళ్లే పరిశ్రమల, పాఠశాలల బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.
బీరంగూడకు దాదాపు 50 పాఠశాలలకు చెందిన బస్సులు నిత్యం విద్యార్థులను ఆయా పాఠశాలలకు తీసుకపోతాయి. కొండాపూర్, హైటెక్ సిటీలకు దగ్గరలోని అనేక కారొరేట్ పాఠశాలల బస్సులు బీరంగూడ ప్రాంతంలో ఉదయం కదలలేకపోయాయి. దాదాపు అరగంట ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరాయి.
కూలీలు, ఇతర కార్మికులు తమ విధులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. కాంట్రాక్టు కార్మికులు ఆటోల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా గంట సేపు కురిసిన వర్షానికి వారు తమ విధులకు చేరలేకపోయారు. జాతీయ రహాదారిపై కూడ ట్రాఫిక్ జామ్ అయ్యిందనే వార్తలతో చాలా మంది తమ ఇళ్లను విడిచి బయటకు రాలేకపోయారు.
ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మాత్రమే వర్షం పడింది. కిష్టారెడ్డిపేట, బీరంగూడ రోడ్డుపై కూడ వర్షం కారణంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. రాఘవేంద్ర కాలనీ, వందనపురి కాలనీలో రోడ్లన్నీ మట్టివే కావండంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లపై ఏర్పడ్డ పెద్ద గొయ్యిల్లో నీరు నిలిచిపోవడంతో కుంటల్లా మారాయి.