ఈ నగరానికి ఏమైంది..?
హైదరాబాద్: ఉదయం లేవగానే.. పిల్లలను స్కూల్కు ఎలా పంపాలని తల్లిదండ్రులు.. ఆఫీసుకు ఎలా వెళ్లాలని ఉద్యోగులు.. వ్యాపారం సాగేదెలా అని తోపుడుబండ్ల వ్యాపారస్తులు.. ఇలా ఎంతోమందికి బెంగ. ఇక సాయంత్రమైతే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామా అనే ధ్యాస. హైదరాబాద్లో గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. వీటంతటికీ కారణం విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలే. నాలుగు గంటలకే కారు మబ్బులతో చీకటి అలుముకుంటోంది. కాసేపు ఎండ.. తర్వాత భారీ వర్షాలు, రాత్రయితే విపరీతమైన చలి.. ఒకే సీజన్లో మూడు సీజన్ల వాతావరణాన్ని చూడాల్సి వస్తోంది. నగరాన్ని ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఓ వైపు ట్రాఫిక్ జామ్.. మరో వైపు రోడ్లు జలమయం అవుతుండటంతో హైదరాబాదీలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి.
భూ ఉపరితలంపై ఏర్పడ్డ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో తీవ్ర నిరాశకు గురైన రైతులకు మాత్రం ఇది శుభవార్త. మరోవైపు నదుల్లోకి వరద నీరు వస్తుండటంతో తాగు, సాగు నీటికి కష్టాలు తొలగుతాయని సంతోషం. వర్షాలు పడటం సమస్త మానవాళికి ఉపయోగరకరమే. అయితే హైదరాబాద్లో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. చినుకు పడితే చాలు.. నగరవాసికి చింతలే.
ఓ మోస్తరు వర్షం కురిస్తేనే కష్టాలు తప్పవు. అలాంటిది గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజులుగా మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చీకటి పడుతోంది. శుక్రవారం వరుణుడి దెబ్బకు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూకటివేళ్లతో సహా చెట్లు కుప్పకూలాయి. సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద వాహనాలపై చెట్లు కూలాయి. మరో 24 గంటల పాటు కూడా నగరానికి భారీ వర్షసూచన ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షాల వల్ల వాతావరణం చల్లబడినా.. వాన కష్టాలకు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.