– రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
– గెలుపోటములపై ‘అనంత’తో పాటు కడప, కర్నూలులో జోరుగా బెట్టింగ్
– పట్టభద్రుల కోటాలో గోపాల్‌రెడ్డి, గేయానంద్, ఉపాధ్యాయ కోటాలో కత్తి, ఒంటేరుపై పందేలు
– కడప, కర్నూలు, నెల్లూరు ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఫలితాలపైనా జోరుగా బెట్టింగ్
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
ఎమ్మెల్సీ ఎన్నికలలో చివరి అంకానికి రంగం సిద్ధమైంది. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు (సోమవారం) జరగనుంది. స్ట్రాంగ్‌రూంలో భద్రంగా ఉన్న ఓటరు తీర్పు రేపు లేదా ఎల్లుండి వెలువడే అవకాశముంది. ఈ ఫలితాలపై ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో జోరుగా పందేలు కాస్తున్నారు. ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలతో పాటు మండలస్థాయి నేతలు కూడా బెట్టింగ్ వేస్తున్నారు. వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా భారీగా బెట్టింగ్ నడుస్తోంది. ఒకవైపు ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతుంటే..మరోవైపు ఫలితాలపై పందేలు కాస్తుండటంతో రాయలసీమలో ‘వేడి’ మొదలైంది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 9న జరిగాయి. పట్టభద్రుల కోటాలో 2,49,582 ఓట్లకు గాను 1,55,536 పోలయ్యాయి. పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50శాతం కంటే ఎక్కువగా ఎవరికి వస్తాయో వారు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు 77,768 కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా..వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇంతకంటే ఒక్క ఓటు తక్కువగా పోలైనా, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కపెడతారు. ఈ ఓట్ల కౌంటింగ్‌లో కూడా 50శాతం కంటే ఒక్క ఓటు(మొదటి ప్రాధాన్యత ఓట్లు కలిపి) అధికంగా వచ్చినా విజేతగా నిర్ణయిస్తారు.
లేదంటే మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఈ ప్రాతిపదికన కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇదే తరహా జరుగుతుంది. ఉపాధ్యాయ కోటాలో 20,515 ఓట్లకుగాను 18,739 పోలయ్యాయి. ఇందులో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువగా అంటే 9,370 ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారు గెలుపొందుతారు. లేదంటే రెండు, అప్పటికీ రాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందని ప్రకటించారు. అయితే.. బ్యాలెట్ పేపర్ల విభజన పూర్తయి ఓట్ల లెక్కింపు మొదలవ్వాలంటే మధ్యాహ్నం రెండు గంటలపైన పడుతుంది. కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరగనుండటంతో ఫలితాలు మంగళవారం వెలువడే అవకాశం ఉంది.
భారీగా బెట్టింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ‘అనంత’లో భారీగా బెట్టింగ్ నడుస్తోంది. పట్టభద్రుల కోటాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్ మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ పార్టీలతో పాటు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వీరిద్దరిపైనే పందేలు కాస్తున్నారు. వీరిపై బెట్టింగ్ చాలా రకాలుగా సాగుతోంది. బరిలోని 25మందిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్‌రెడ్డికి అధికంగా పోలవుతాయని భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్‌రాయుళ్లలో దాదాపు 90శాతం ఇదేవిధంగా వేస్తున్నారు. ఈ ఓట్లు అధికంగా వస్తాయనే కారణంతో గెలుపు విషయంలో కూడా గోపాల్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పందేలు 1ః1(రూపాయికి రూపాయి) లెక్కన కాస్తున్నారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్‌రెడ్డికి ఎక్కువగా వస్తాయని, అయితే అవి 50 శాతం కంటే మించడం కష్టమని, కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లతో గేయానంద్ కూడా గెలిచే అవకాశాలున్నాయని కొందరు పందెం కాస్తున్నారు. వీరిద్దరిపైనే బెట్టింగ్ జరుగుతుండటంతో రేసులో టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డి లేరని స్పష్టమవుతోంది. అయిన్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్‌రెడ్డి తర్వాత కేజేరెడ్డికే వస్తాయని కొందరు పందెం వేస్తున్నారు. మొత్తమ్మీద గోపాల్‌రెడ్డి గెలుస్తారని 1ః1 పందేలు జరుగుతుంటే, గేయానంద్ గెలుస్తారనే వారు 2ః1(రెండు రూపాయలకు ఒక్క రూపాయి) కాస్తున్నారు.
ఉపాధ్యాయ కోటాలో కత్తి, ఒంటేరుపై పందేలు
ఉపాధ్యాయ కోటాలో కత్తినరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. బరిలోని 10మందిలో కత్తినరసింహారెడ్డి, బచ్చలపుల్లయ్య, ఒంటేరు మధ్య త్రిముఖ పోరు నడిచినట్లు పోలింగ్ సమయంలో చర్చ సాగింది. అయితే.. ఇప్పుడు కత్తి, ఒంటేరుపైనే అధికంగా పందేలు వేస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య రేసులో ఉన్నారా, లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఓసీల మధ్య బీసీకార్డుతో బరిలోకి దిగి విజయం సాధిద్దామని ఆశపడిన పుల్లయ్యను టీడీపీ వ్యతిరేక ఓటు దెబ్బతీసిందని కూడా ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే.. కొందరు కత్తి, పుల్లయ్య మధ్య, ఇంకొందరు ఒంటేరు, పుల్లయ్య మధ్య కూడా పందేలు కాస్తున్నారు. 1ః1 ప్రకారమే పందేలు నడుస్తున్నాయి. అనంతపురంతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఇదే తరహాలో వేస్తున్నారు.
‘స్థానిక’ పోరుపైనా..
వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ‘అనంత’లో పందేలు కాస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వివేకానందరెడ్డికి బీటెక్ రవి గట్టిపోటీ ఇచ్చారని, ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం లేదని ఓ వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే.. శనివారం నుంచి వివేకా గెలుస్తారని బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందెం వేస్తున్నారు.
దీంతో వివేకా విజయంపై రాజకీయ పార్టీల్లోనూ స్పష్టత వచ్చినట్లయింది. కర్నూలులో కూడా గౌరు వెంకటరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. ఇవి రూపాయికి రూపాయి అనే లెక్కన నడుస్తున్నాయి. ఈ పందేలు కాసేవారిలో ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ద్వితీయశ్రేణి నేతలు కూడా ఉన్నారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకూ ఒక్కొక్కరు పందేం కాస్తున్నారు. ఎమ్మెల్యేలు వారి పీఏలతో వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో పందెం కాయాలనుకునేవారంతా పీఏలను సంప్రదిస్తున్నారు. మొత్తమ్మీద అభ్యర్థులతో పాటు పందెం రాయుళ్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో, దురదృష్టం వెంటాడుతుందో వేచి ఉండాల్సిందే!
‘బెట్టింగ్’ హీట్
Published Sat, Mar 18 2017 11:52 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement