గిరిప్రదక్షిణ ఇలా ... | Bhavani Deeksha Viramana in Vijayawada | Sakshi
Sakshi News home page

గిరిప్రదక్షిణ ఇలా ...

Published Wed, Dec 30 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

గిరిప్రదక్షిణ ఇలా ...

గిరిప్రదక్షిణ ఇలా ...

దుర్గగుడి ఫ్లైవోవర్ పనులతో ట్రాఫిక్ ఎక్కువ
భారీ వాహనాలతో జాగ్రత్తగా ఉండండి
రోడ్డు పక్కగా నడిస్తేనే మంచిది
రాత్రివేళ ప్రదక్షిణకు కాస్త అనుకూలం
గ్రూపుగా వెళ్తేనే మంచిది
భవానీలు జాగ్రత్త సుమా..

 
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : బస్సులు, రైళ్లలో  నగరానికి చేరుకున్న భవానీలు పుణ్యస్నానాలు చేసేందుకు పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, దుర్గాఘాట్, భవానీఘాట్, పున్నమి ఘాట్లను సిద్ధం చేశారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు దుర్గగుడి టోల్‌గేట్ నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించవచ్చు... సుమారు ఏడు కిలోమీటర్లు, 2.30 గంటల్లో గిరిప్రదక్షిణ పూర్తిచేసుకుని వినాయకుడి గుడి మీదుగా దుర్గమ్మ దర్శన క్యూలైన్‌కు చేరుకోవచ్చు.

ఒకసారి క్యూలైన్‌లోకి చేరుకున్న తర్వాత అమ్మవారి దర్శనం, ఇరుముడి బంధాల సమర్పణ, హోమగుండం, ప్రసాదాల కొనుగోలుతో బయటకు రావడమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో భవానీలు ఇబ్బందులు పడకుండా ఏయే ప్రాంతాల నుంచి వెళ్లాలి, ఎంత సమయం పడుతుందనే విషయాలను ‘సాక్షి’ సేకరించింది. ఆ వివరాలు..
 
 గిరిప్రదక్షిణ మార్గం - సమయం
టోల్‌గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటర్‌కు : 15 నిమిషాలు
కుమ్మరిపాలెం నుంచి నాలుగు స్తంభాల సెంటర్‌కు : 10 నిమిషాలు
నాలుగు స్తంభాల నుంచి చెరువు సెంటర్‌కు : 10 నిమిషాలు
చెరువు సెంటర్ నుంచి సితారా జంక్షన్‌కు : 10 నిమిషాలు
సితార జంక్షన్ నుంచి కబేళాకు : 20 నిమిషాలు
పాలప్రాజెక్టు నుంచి చిట్టినగర్‌కు : 25 నిమిషాలు
చిట్టినగర్ నుంచి నెహ్రూబొమ్మ సెంటర్‌కు : 25 నిమిషాలు
నెహ్రూబొమ్మ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా రథం సెంటర్‌కు : 35 నిమిషాలు

 
అనువైన సమయాలివీ : 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణకు ముందు రోజు నుంచే భవానీలు నగరానికి చేరుకునే అవకాశం ఉంది. గిరిప్రదక్షిణకు తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకూ, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, తిరిగి రాత్రి 9 నుంచి 12 గంటల వరకూ మార్గం సుగమమవుతుంది.
 
 
విరమణకు విస్తృత ఏర్పాట్లు
మరో 24 గంటల్లో ప్రారంభంకానున్న భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది.  ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఎనిమిది లక్షల మంది భవానీ భక్తులు జగన్మాతను దర్శించుకుని ఇరుముళ్లు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావు. భవానీ దీక్షల విరమణను పురస్కరించుకుని మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...            
 
 తెల్లవారుజామునుంచే దర్శనాలు
వచ్చేనెల నాల్గో తేదీ వరకూ జరిగే భవానీ దీక్షల విరమణ గురువారం అగ్నిప్రతిష్టాపనతో ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు దర్శనాలకు అనుమతిస్తాం. తరువాత నాలుగు రోజులూ తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకూ దర్శనం చేసుకోవచ్చు. పంచ హారతులు, అమ్మవారి నివేదన కోసం సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకూ దర్శనం నిలిపివేస్తాం.
 
దర్శనానికి ఐదు లైన్లు
దర్శనానికి ఐదు క్యూలైన్లు ఏర్పాటుచేశాం. రూ.200 చెల్లించి అంతరాలయ దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం చేసుకునే సదుపాయం కల్పించాలి. దర్శనానంతరం మహామండపం ద్వారా మూడు లైన్లు, శివాలయం మెట్లమార్గం ద్వారా రెండు లైన్ల ద్వారా భక్తుల్ని కొండ కిందకు పంపుతాం.
 
కొండ దిగువన హోమగుండాలు

 ఏటా మాదిరిగానే కొండ దిగువన నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే భవానీ బంధనాలు తీసి  హోమగుండాల్లో పూజా ద్రవ్యాలు వేయవచ్చు. భక్తుల కోరిక మేరకు గురుభవానీలే వచ్చి వారి బృందంలోని భక్తులకు బంధనాలు తీసే ఏర్పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా చేస్తున్నాం. కావాలంటే దేవస్థానం అర్చకుల సహాయం   తీసుకోవచ్చు.
 
 ఇతర సౌకర్యాలు
దుర్గా, పున్నమి, భవానీ, పద్మావతి, కృష్ణవేణి స్నానఘట్టాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నాం. దుస్తులు మార్చుకునేందుకు మరుగుదొడ్లు, 300 తాత్కాలిక టాయిలెట్లు నిర్మించాం. ప్రతి స్నానఘట్టంలోనూ క్షురకులు సిద్ధంగా ఉంటున్నారు. భక్తుల ఇబ్బందుల్ని తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేశాం. 24 గంటలూ మైక్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి.
 
గిరిప్రదక్షిణ కు ఏర్పాట్లు
 ప్లైవోవర్ పనులను కలెక్టర్ ఆదేశాల మేరకు 4వ తేదీ వరకూ నిలిపివేశాం. మార్గంమధ్యలో భక్తులు ఇబ్బంది పడకుండా వైద్య శిబిరాలు, మంచినీటి సౌకర్యం కల్పించాం. తెల్లవారుజామున భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన లైటింగ్ ఏర్పాటుచేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నందున చిన్నచిన్న ఇబ్బందులు భక్తులు పట్టించుకోకుండా సహనంతో ముందుకు వెళ్లాలి.
 
రోజూ పదివేల మందికి అన్నప్రసాదం
 శృంగేరి వడ్లమన్నాటి సత్రంలో రోజుకు పదివేల మంది చొప్పున ఐదు రోజుల్లో 50వేల మందికి ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తాం. గత ఏడాది 11 లక్షల వాటర్ ప్యాకెట్లు వినియోగించగా.. ఈ ఏడాది 15 లక్షల వాటర్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నాం. రెండురోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండ కుండా ప్యాకెట్లు తయారు చేస్తాం. భక్తులకు సేవలు అందించేందుకు 600 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సిద్ధంగా ఉంటారు.
 
అందుబాటులో 15 లక్షల లడ్డూ
 గత ఏడాది 11 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేయించగా, ఈ ఏడాది 15 లక్షలు తయారు చేయిస్తున్నాం. గతంలో 14 ప్రసాదాల కౌంటర్లు ఉండగా, ఈసారి 20 కౌంటర్లకు పెంచాం. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లోనూ ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి.
 
భక్తులు సహనం వహిస్తే..
 అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సహనం వహించి భక్తిభావంతో దర్శనం చేసుకుంటే దీక్షల విరమణ మధురస్మృతిగా మారుతుంది. ఆ దిశగా ప్రతి భక్తుడూ ప్రయత్నించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement