ఎనిమిరెడ్డి..‘కమల దళపతి’
►దొరబాబుపై 11 ఓట్ల ఆధిక్యతతో గెలుపు
► ఉత్కంఠభరితంగాబీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక
జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన ఎనిమిరెడ్డిని అభినందిస్తున్న ప్రత్యర్థి దొరబాబు
బోట్‌క్లబ్ (కాకినాడ) : గత 24 సంవత్సరాలుగా ఏకగ్రీవంగానే జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక ఈసారి.. ఇద్దరి మధ్య ‘నువ్వా, నేనా’ అన్న రీతిలో ఉత్కంఠభరితంగా జరిగింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య.. కోనసీమకు చెందిన నేత యూళ్ల దొరబాబుపై 11 ఓట్ల ఆధిక్యతతో మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యూరు. బీజేపీ ఇదివరకు ఎన్నడూ లేనన్ని ఎంపీ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టడంతో పాటు 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకశక్తిగా ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో.. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష స్థానానికి మునుపెన్నడూ లేనంత పోటీ పెరిగింది.
జిల్లా నాయకులు మూడు రోజుల క్రితం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఎన్నిక నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలిపారు. దీంతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎన్నిక నిర్వహించింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కోనసీమకు చెందిన నేత యాళ్ల దొరబాబు పోటీ పడ్డారు.
పార్టీ నియమావళి ప్రకారం మండల అధ్యక్షుడు, మండల ప్రతినిధి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాన్నిబట్టి జిల్లాలో 116 ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా 111 మంది ఓట్లు వేశారు. ఎనిమిరెడ్డికి 61 ఓట్లు, దొరబాబుకు 50 ఓట్లు వచ్చాయి. 2010 నుంచి 2013 వరకూ పార్టీ జిల్లా సారథిగా ఉన్న ఎనిమిరెడ్డి 11 ఓట్ల ఆధిక్యతతో ఆ పదవికి మరోసారి ఎన్నికయ్యూరు. త్రిసభ్య కమిటీ సభ్యులుగా పార్టీ జాతీయ కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు చల్లపల్లి నరసింహారెడ్డి, రాష్ట్ర ఎన్నికల అధికారి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, ఉప ఎన్నికల అధికారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీపతిరాజా వ్యవహరించారు.
ఫలించని త్రిసభ్య కమిటీ యత్నం
ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లా కోర్ కమిటీ సభ్యులతో, పార్టీ నేతలతో మధ్యాహ్నం వరకూ జరిపిన చర్చలు ఫలించలేదు. దాంతో సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల వరకూ ఓటింగ్ నిర్వహించి, అనంతరం ఫలితం వెల్లడించారు. ఎన్నిక సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల అభిమానులతో ఆర్ అండ్ బీ అతిథి గృహం కిక్కిరిసిపోయింది. ఎన్నికైన అనంతరం ఎనిమిరెడ్డిని బీజేపీ నాయకులు అభినందించారు.