
స్థానిక కోటాకు గోవిందా..
రోజులు మారుతున్నాయి.. మనుషులు మారుతున్నారు.. వారి ప్రవర్తనలో మార్పు వస్తోంది.. అనుకున్న వస్తువు, లేదా మరేదైనా దక్కకపోతే దానవులుగా మారిపోతున్నారు.
♦ తిరుపతి వాసులపై ప్రభుత్వానికి చిన్నచూపు
♦ శ్రీవారి దర్శన భాగ్యానికి దూరం చేసిన వైనం
♦ ప్రతినెలా మొదటి మంగళవారానికి మంగళం
♦ మూడునెలలకోసారీ దొరకని దర్శనం
♦ మహతి నుంచి తిరుమలకు బుకింగ్ కౌంటర్
♦ స్థానికుల కోటాపై దళారుల కన్ను
రోజూ ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. ఏడుకొండలెక్కి దర్శించుకుందామంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాలి. తిరుమల పాదాల చెంత ఉండి కూడా స్వామి దర్శనం తిరుపతి వాసులకు కష్టమే. గతంలో పెట్టిన ‘స్థానిక’ కోటాకు ప్రభుత్వం మంగళం పాడేయడంతో వెంకన్నను దర్శించుకోవాలంటే దూర ప్రాంతాల భక్తుల్లానే నిరీక్షించాల్సిందే. పైగా తిరుపతి వాసుల కోటాపై దళారులు కన్నేసి అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, తిరుపతి: తిరుమలేశుని దర్శన భాగ్యానికి తిరుపతి వాసులను ప్రభుత్వం దూరం చేస్తోంది. స్థానికులకున్న దర్శనం కోటాకు కోతపెట్టింది. ప్రతినెలా మొదటి మంగళవారం వీరికి కేటాయించిన శ్రీవారి దర్శనం కోటాను మూడునెలలకోసారిగా మార్చింది. ఇప్పుడు ఆ అవకాశానికి కూడా ప్రభుత్వం, టీటీడీ మంగళం పాడేందుకు రంగం సిద్దం చేస్తున్నాయని తెలిసింది. తిరుమలకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో స్థానికులకు దర్శనం కష్టంగా మారింది.
తమ కోసం ప్రత్యేకంగా కోటా కల్పించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఫలితంగా 2013 బ్రహ్మోత్సవాల అనంతరం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. తిరుపతిలో నివాసం ఉండేవారికి (ఆధార్ ఆధారంగా) ప్రతినెలా మొదటి మంగళవారం ప్రత్యేకంగా దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంతో పాటు తిరుమలలో స్థానికుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. టీటీడీ మొదటి మంగళవారం ఐదు సేవలకు అవసరమైన టికెట్లు ఇచ్చేవారు. మొదట్లో కొద్దిరోజులు 5వేల మంది వరకు స్థానికులు శ్రీవారిని దర్శించుకునేవారు.
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2015 నుంచి స్థానికుల దర్శనం కోటాలో సమూల మార్పులు చేయటం ప్రారంభించారు. ప్రతినెలా మొదటి మంగళవారం భక్తుల సంఖ్యను పరి మితం చేశారు. వేల నుంచి వందలకు కుదించారు. మొదటి మంగళవారంలో 600 టికెట్లు సుప్రభాతం, నిజపాద దర్శనం, తిరుప్పావడ, సహస్రకళసాభిషేకం, అష్టదళపాదపద్మారాదన సేవ కోసం ఇచ్చేవారు. కొన్నాళ్లకు ప్రతి మూడునెలల కొకసారి అంటూ నిబంధన పెట్టారు.
స్థానికుల కోటా ఎత్తివేత?
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో స్థానిక దర్శనం కోటాను ఎత్తేయడానికి టీటీడీ సిద్ధమైనట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. మహతిలో ఉన్న కౌంటర్‌ను తిరుమలలోని జేఈఓ కార్యాలయానికి మార్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడైనా స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారా? అంటే అదీ లేదని మండిపడుతున్నారు. గతంలో కరెంట్ బుకింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు ఇచ్చేవారని, ప్రస్తుతం అవేమీ లేకుండా చేసినట్లు చెబుతున్నారు.
ప్రతి మూడునెలల కొకసారి వచ్చే మొదటి మంగళవారంలో మొక్కుబడిగా 100 లేదా 120 టికెట్లు మాత్రం స్థానికులకు ఇచ్చి మిగిలినవి కొందరు దళారులు అమ్మి సొమ్ముచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ అధికారులు స్థానికుల దర్శన కోటా సేవా టికెట్లను సైతం వీఐపీలకు కేటాయించి తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం, టీటీడీ అధికారులు స్పందించి స్థానిక కోటాను కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.