బీపీఎస్ సొమ్మంతా కార్పొరేషన్‌కు..
విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం కింద వసూలైన రూ.49 కోట్లను నగరపాలక సంస్థకే కేటాయిస్తూ మునిసిపల్ మంత్రి పి.నారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వివిధ పద్దుల ద్వారా కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం విషయమై మేయర్ కోనేరు శ్రీధర్ సెక్రటేరియెట్‌లో మంత్రిని కలిశారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని బీపీఎస్ నిధులు మొత్తం విడుదల చేయాల్సిందిగా కోరారు. నిబంధనల ప్రకారం బీపీఎస్‌లో 50 శాతం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెల్లించాల్సి ఉంది. మేయర్ విజ్ఞప్తి మేరకు పూర్తి సొమ్మును నగరపాలకసంస్థకు కేటాయిస్తూ మంత్రి జీవో విడుదల చేశారు. ఆన్‌లైన్ బిల్డింగ్‌ప్లాన్ల ద్వారా వసూలైన రూ.42 కోట్లు విడుదల చేయాల్సిందిగా మేయర్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సురేష్, టౌన్‌అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ జీవి.రఘు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వి.నాగమణిని మేయర్ కలిసి నగరపాలక సంస్థ స్థితిగతులపై వివరించారు. కో ఆప్షన్‌సభ్యులు సిద్ధెం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.