= బంధువుల ఇంటికొచ్చి.. ఈతకెళ్లి..
= నీటిలో మునిగి అన్నదమ్ముళ్ల మృతి
= పెళ్లై నెల కాకనే నిండిన నూరేళ్లు
= కన్నీరుమున్నీరైన నవ వధువు
పెనుకొండ రూరల్: వైవాహిక జీవితం.. కాబోయే భాగస్వామి గురించి కోటి ఆశలతో ఆమె అత్తారింట అడుగుపెట్టింది. పెళ్లై పట్టుమని నెల రోజులు కాలేదు. అచ్చటా, ముచ్చట కూడా తీరనే లేదు. ఇంకా బంధువుల ఊర్లకు తిరగడంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి పెనుకొండలోని బంధువుల ఇంటికొచ్చారు. కొత్త జంట వచ్చిన ఆనందంలో వారంతా కలసి పెనుకొండకు సమీపంలోని హంద్రీ–నీవా రిజర్వాయర్ వద్దకు జలకాలాటల కోసం ఆనందంగా వెళ్లారు. అంతే.. పెళ్లికొడుకు సల్మాన్(21)తో పాటు అతని తమ్ముడు సద్దాం(19) ఇద్దరూ రిజర్వాయర్‌లో జలసమాధి కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురానికి చెందిన సనావుల్లాకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తెకు పెళ్లి అయింది. ఆ తరువాత అతను చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబ భారం పిల్లలపై పడింది. అన్నదమ్ముళ్లిద్దరూ బెంగళూరులో కార్లకు రంగు కొట్టడం, వాటి విడిభాగాలు అమ్మడం ద్వారా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
నెల కిందటే పెళ్లి...
సల్మాన్ పెళ్లి హిందూపురానికి చెందిన ఫిరదౌస్‌తో గత నెల 28న అయింది. కొత్త జంట బంధువుల ఊర్లకు తిరగడంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెనుకొండలోని దర్గా పేటలో గల బంధువుల ఇంటికొచ్చారు. అందరూ కలసి కారులో హంద్రీ–నీవా రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగిన సల్మాన్ నీటిలో మునిగిపోతుండగా, అతన్ని రక్షించే క్రమంలో తమ్ముడు సద్దాం కూడా నీటిలోకి దిగాడు. నీటిలో మునిగిపోతూ ఇద్దరూ వేసిన కేకలతో బంధువులు, గ్రామస్తులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఊపిరాడక నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలొదిలారు. జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న భర్త ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఫిరదౌస్ గుండెలు పగిలేలా ఏడ్వడం అందరి గుండెలను పిండేసింది. ఇక తన జీవితం ఏం కావాలని ఆమె ప్రశ్నించడం చూసిన వారి కళ్లు నీటితో చెమర్చాయి.