బుకాయింపు!
బుకాయింపు!
Published Sun, Jan 22 2017 10:06 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
అడ్రస్‌లేని వడ్డీరాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీ
రూ.81కోట్ల బకాయిలు
చెల్లింపుల్లో ఉదాసీనం
అయినా సర్కారు కోతలు
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతను అడుగడుగునా దగా చేస్తోంది. ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు.. సబ్సిడీలన్నీ చెల్లించేస్తున్నట్టు బుకాయిస్తోంది. ఫలితంగా అన్నదాతకు వేదనే మిగులుతోంది.
ఆకివీడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు బకాయి పడిపోయాయి. జిల్లాలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద రూ. 81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా వడ్డీ రాయితీని విడుదల చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలిస్తున్నా.. రైతులకు చెల్లింపులు జరగడం లేదు. రైతులు తీసుకున్న స్వల్ప, దీర్ఘ కాలిక రుణాలకు సంబంధించి మూడేళ్లుగా వడ్డీరాయితీ సొమ్ము రైతులకు అందలేదు. కేంద్రం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ సొమ్ము రాష్ట్రానికి చేరినా ఆ సొమ్ము దారి మళ్లిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీ 6 శాతం వాటా విడుదల చేయలేదు. దీంతో మూడేళ్లుగా రైతులకు వడ్డీ రాయితీ అందడం లేదు.
ఇన్‌పుట్ సబ్సిడీదీ అదే దారి
రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయట్లేదు. 201314, 201415 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్టపరిహారం(ఇన్‌ఫుట్‌సబ్సిడీ)ని ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీ కలిపి రూ.81కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
మద్దతు ధరపైనా నిర్లక్ష్యం
ఏటా సరైన మద్దతు ధర దక్కక రైతు అష్టకష్టాలు పడుతున్నాడు. ఉత్పత్తుల వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిటీ సూచించినా, కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ అ«ధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినా స్పందన లేదు. వచ్చే జూన్‌లో ప్రకటించనున్న ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,800 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
వడ్డీకి వడ్డీ చెల్లిస్తారా!
వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. మూడేళ్లుగా స్వల్ప కాలిక రుణాలకు, ఆరేళ్లుగా దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించాలి. ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్న ప్రభుత్వం ఆ సొమ్ముకు వడ్డీ చెల్లించాలి. ధాన్యం మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ప్రకటించాలి.
మల్లారెడ్డి శేషమోహన రÆంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, అప్పారావుపేట
బకాయిలు రావాలి
జిల్లాలోని రైతులకు వడ్డీ రాయితీ సొమ్ము, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం రూ.81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధీర్ఘకాలిక అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఆరు శాతం వడ్డీ రాయితీ ఆరేళ్లుగా రైతులకు అందడంలేదు. ఆప్కాబ్ నుంచి జిల్లా సహకార బ్యాంక్‌కు ఆ సొమ్ము మంజూరైతే జిల్లాలోని అన్ని సొసైటీలకు జమ చేస్తాం.
వి.వి.ఫణికుమార్, సీఈవో, జిల్లా సహకార బ్యాంక్, ఏలూరు
Advertisement
Advertisement