‘చంద్రబాబు మైండ్‌సెట్ మార్చుకోవాలి’
రాజంపేట : పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయని చెబుతున్న ముఖ్యమంత్రి.. అవి ఏర్పాటయ్యే వాతావరణం కల్పించలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం లేదని, 2002లో సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను ప్రజలకు చెప్పని చంద్రబాబు తొలుత మైండ్‌సెట్ మార్చుకోవాలని హితవుపలికారు.
'ప్రోత్సాహకాలు లేకుంటే పరిశ్రమలు రావు. అలాంటివేవీ ప్రకటించకుండా పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్న చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు వెర్రోళ్లలా కనిపిస్తున్నారా? ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజ్యంగా భావించి.. తమ అనుమతి లేకుండా ఏవీ రాకుడదని, తాము చెప్పిందే జరిగాలనే నియంతత్వపోకడలకు పోతుంటే పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరు ముందుకు వస్తారు?' అని సోమవారం వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట మండలం తొగురుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రయ్య అన్నారు.
కృష్ణా జిల్లా నూజీవీడు వద్ద డీనోటిఫికేషన్ అంశంలో ఫారెస్టు నుంచి రెవిన్యూకు మార్చేందుకు వైఎస్‌ఆర్ జిల్లాలో ప్రత్యామ్నాయంగా 25 వేల హెక్టార్ల భూమలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, అలా చేస్తే వైఎస్‌ఆర్ జిల్లా వాసులు చూస్తూ ఊరుకోరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సొంతప్రాంతమైన రాయలసీమను విస్మరించి అత్తింటి ప్రాంత అభివద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ఎద్దేవాచేశారు. రాజధాని నిర్మాణం కోసం అంటూ చివరకు విద్యార్థులనూ వదలకుండా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బహిరంగంగా తిరుగుతున్నా అరెస్టు చేయలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.