పగిలిన కారు టైరు 11 మంది దుర్మరణం
♦ బైక్‌ను ఢీకొట్టడంతో లారీ కిందకు దూసుకెళ్లిన కారు
♦ విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై దుర్ఘటన
♦ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ దిగ్భ్రాంతి
నక్కపల్లి: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 11 మంది ప్రాణాలను బలిగొంది. విశాఖ నుంచి తుని వైపు వేగంగా వెళుతున్న ఓ కారు.. టైర్ పంక్చరవడంతో అదుపు తప్పి ముందు వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడమేగాక.. దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందితోపాటు బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారిని విశాఖపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందినవారుగా గుర్తించారు. మృత్యువాత పడిన తండ్రీకొడుకులు ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరువాసులు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దైవదర్శనంకోసం బయల్దేరి..
విశాఖపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన నక్కా వెంకటలక్ష్మి కుటుంబం తుని సమీపంలోని తలుపులమ్మలోవ దర్శనానికి కారులో బయలుదేరింది. కారు వేగంగా వెళుతున్న సమయంలో నక్కపల్లి సమీపంలోకి రాగానే టైరు పంక్చరైంది. దీంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. తరువాత ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న లారీనీ ఢీకొని దాని కిందభాగంలోకి దూసుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో నక్కా వెంకటలక్ష్మి (60), ఆమె పెద్ద కుమార్తె పద్మ(43), పద్మ పిల్లలు కుమార్(20), సాయి(16), వెంకటలక్ష్మి రెండో కుమార్తె ఈదరదేవి(35), అల్లుడు ఈదర శ్రీను(42, కారు నడుపుతున్న వ్యక్తి), వారి పిల్లలు సాయి(11) దుర్గా అపర్ణ(6) పవన్(7) ఉన్నారు. కారు నుజ్జునుజ్జవడంతో వీరంతా సీట్లలో ఇరుక్కుపోయారు.
బైక్‌పై వెళ్తున్న ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన తండ్రీకొడుకులు దాట్ల చిరంజీవిరాజు(41), ఆయన కుమారుడు ఆనంద్ సాగర్ వర్మ(6) కూడా ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. దాట్ల చిరంజీవిరాజు హెటెరో డ్రగ్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై చాలాసేపు వాహనాల రాకపోకలు నిలచిపోయాయి. నుజ్జునుజ్జయిపోయిన కారు.. అందులోని మృతదేహాలు, ధ్వంసమైన బైకు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహంగా తయారైంది. దైవదర్శనం కోసం బయల్దేరిన కుటుంబం శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాద విషయం తెలియడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్రేన్‌లు, హైవే సిబ్బంది సహాయంతో మృతదేహాలను బయటకు తీయించి.. పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియడంతో మృతుల బంధువులు నక్కపల్లి ఆస్పత్రికి పెద్దసంఖ్యలో చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. ప్రమాద స్థలాన్ని విశాఖ రేంజ్ డీఐజీ రవిచంద్ర, ఎస్పీ కోయ ప్రవీణ్, ఏఎస్పీ రస్తోగి తదితరులు పరిశీలించారు.
సంఘటనపై సీఎం ఆరా
ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ యువరాజ్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి గంటా తెలిపారు.