పుష్కర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమేరాలతో నిఘా
-
ఎస్పీ విజయకుమార్ వెల్లడి
అవనిగడ్డ: పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెంచనున్నట్లు ఎస్పీ జీ విజయకుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్మించిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఒంగోలు–విశాఖపట్నం మధ్య వెళ్లే వాహనాలు దివిసీమ మీదుగా దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భారీ వాహనాలను ఒంగోలు, అద్దంకి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, సత్తుపల్లి, ఖమ్మం, రాజమండ్రి మీదుగా విశాఖ, ఇతర వాహనాలను ఒంగోలు, చీరాల, బాపట్ల, రేపల్లె, పులిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి మీదుగా పామర్రు వైపు ఒక మార్గం, మచిలీపట్నం నుంచి పెడన వైపు మరో మార్గాన మళ్లించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి గ్రామాల సూచీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఉంటాయని తెలిపారు. కోడూరు మండలం సాగర ‡సంగమం పాయింట్ వద్ద నది కోత ఎక్కువగా ఉన్నందున స్నానాలకు అనుమతి లేదన్నారు. ఇక్కడ జల్లు స్నానాలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారీ కేడ్లు, ఐరన్ మెస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సాగర సంగమం, హంసలదీవి, మోపిదేవి ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ఆయన వెంట డీఎస్పీ ఖాదర్‌బాషా ఉన్నారు.