
వ్యవ‘సాయం’ అంతంతే
- వేరుశనగకు వర్తించని ఫసల్‌బీమా.. రైతుల్లో నిరాశ
– కంప్యూటరీకరణతో సొసైటీల్లో పారదర్శక సేవలు
– కేవీకేలో ల్యాబ్‌ల ద్వారా మట్టి, నీటి పరీక్షలు మేలు
– 60 రోజుల్లో రుణాలు చెల్లించడం జిల్లాలో కష్టసాధ్యమే
– జిల్లాకు సూక్ష్మసాగు విస్తరణ అవసరమంటున్న రైతులు
----------------------------
అనంతపురం అగ్రికల్చర్ : కేంద్ర బడ్జెట్ ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి కలిగే మేలు అంతంత మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఫసల్‌బీమా యోజనను 30 నుంచి 40 శాతానికి పెంచినప్పటికీ దీనివల్ల జిల్లాకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. జిల్లాలో వేరుశనగకు వర్తింపజేయకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో ఏటా 6 నుంచి 7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతోంది. ఖరీఫ్‌లో 90 శాతం విస్తీర్ణం కేవలం వేరుశనగ వేస్తున్నారు. ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట 80 నుంచి 90 శాతం తుడిచిపెట్టుకుపోతోంది.
పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. జిల్లా రైతులు వేరుశనగ సాగువల్ల రూ.3 వేల నుంచి రూ.3,500 కోట్ల వరకు నష్టపోతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రామం యూనిట్‌గా అమలు చేసిన పంటల బీమా పథకం ద్వారా రైతులకు ప్రయోజనం కలిగింది. పంట నష్టం జరిగిన ప్రతీ సంవత్సరం పారదర్శకంగా నష్టపరిహారం అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం 2008 ఖరీఫ్‌కు సంబంధించి పంట దారుణంగా నష్టపోగా... రూ.640 కోట్ల వరకు పంట నష్ట పరిహారం ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగింది.
అయితే త్రెష్‌హోల్ట్‌ఈల్డ్, ఇండెమ్నిటీ అనే నిబంధనలు పరిహారానికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని 2011లో గ్రాయం యూనిట్‌గా అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో కొత్తగా వర్షాధార వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చారు. 2011 నుంచి ఏటా పంట దారుణంగా నష్టపోతున్నా ఒక్క సంవత్సరం కూడా రైతులకు న్యాయం జరగలేదు. అడ్డగోలు నిబంధనలు, సవాలక్ష షరతుల వల్ల వాతావరణ బీమా ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2016 ఖరీఫ్ నుంచి కొత్తగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనాను అమలులోకి తెచ్చింది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్న వేరుశనగ పంటకు వర్తింపజేయలేదు. ఈ క్రమంలో ఫసల్‌బీమా ద్వారా జిల్లాలో కనీసం వేయి మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కడం లేదు. ఈ ఏడాదైనా ఫసల్‌బీమా వర్తింపజేస్తారని ఆశించినా కేంద్ర ఆర్థిక మంత్రి అడియాసలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
------------------
డెయిరీపై ఆశలు లేనట్లే!
రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)పై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేయడంతో జిల్లాలో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్య దశకు చేరుకుని నష్టాల్లో పయనిస్తోంది. అనంతపురం, హిందూపురంలో లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నా... ఇపుడు రోజుకు 30 నుంచి 32 వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తుండడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. 2013, 2014 సంవత్సరం జనవరి నెలల్లో ప్రభుత్వ డెయిరీ రోజు వారీ 65 వేల లీటర్ల వరకు పాలు సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత పాల సేకరణ తగ్గింది. 20 వేల మంది రైతుల సంఖ్య ప్రస్తుతం 9 వేల మందికి పడిపోయింది. గతంలో ప్రతి 15 రోజులకోసారి క్రమం తప్పకుండా రూ.3 కోట్లకు పైగా పాల బట్వాడా చేస్తుండగా ఇపుడు నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి.
-------
60 రోజుల్లో రుణాల చెల్లింపు కష్టమే
‘అనంత’లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి 60 రోజుల్లోపు చెల్లించి వడ్డీ రాయితీ పొందడం అనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతింటూ అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించడమే భారంగా పరిణమిస్తోంది. కనీసం వడ్డీ కూడా చెల్లించలేక, రుణాలను రెన్యువల్ కూడా చేసుకోలేని దయనీయ పరిస్థితి. బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక వాటిని వేలాలకు వదిలేస్తున్నారు. కేవలం 60 రోజుల్లో చెల్లించడం అనేది ‘అనంత’ రైతులకు తలకు మించిన భారమే. కనీసం ఆరు నెలల గడువు ఇచ్చినా కొందరికైనా కొంత ప్రయోజనం కలిగేఽది.
------
పంట రుణాల పెంపుతో కొంత లబ్ధి
పంట రుణాల పంపిణీకి పెద్దపీట వేసినట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడంతో కరువు జిల్లా రైతులకు కొంత ఊరట కలిగే అంశం. సన్న, చిన్న కారు రైతుల్లో 40 శాతం మందికి రుణాలు అందడం గగనంగా మారింది. ఈ ఖరీఫ్‌లో 5.70 లక్షల మంది రైతులకు రూ.4,404 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశారు. రబీలో 1.05 లక్షల మందికి రూ.750 కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సివుండగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.200 కోట్లుకు మించి ఇవ్వలేదు. చాలా మంది చిన్న సన్న కారు రైతులకు రుణాలు అందకపోవడం, వారు బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో... పంట రుణాలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత వరకు న్యాయం జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-----------------------
కేవీకేల్లో మినీల్యాబ్‌లు లాభం
జిల్లా కేంద్రంలో ఒకటి, పెనుకొండ, ధర్మవరం లలో రెండు మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉండడంతో మట్టి, నీటి పరీక్షలు చేయించుకోవడం లక్షలాది మంది రైతులకు కష్టంగా మారింది.
కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే)లో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడం రైతులకు లాభించే అంశఽం. జిల్లాలో బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి, కళ్యాణదుర్గంలో ఉన్న కేవీకేలలో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగం
-------------------
కంప్యూటరీకరణతో సొసైటీల్లో సత్వర సేవలు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటరీకరణ చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడంతో జిల్లాలో కొంత మెరుగైన సేవలు అందవచ్చు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 104 సొసైటీలు ఉండగా... మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో 16 సీడెడ్ సొసైటీలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో కణేకల్లు, కనగానపల్లి, మడకశిర, రుద్రంపేట సొసైటీల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అందజేస్తున్న కంప్యూటరీకరణ సేవలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు డీసీసీబీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
-------------------
సూక్ష్మసాగు విస్తరణ అత్యవసరం
వర్షాభావ పరిస్థితులు, భూగర్భాజలాలు అడుగంటి రుబావులు ఎండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా పట్టు, పండ్లతోటలతో పాటు వ్యవసాయ పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి. చీనీ, మామిడి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష లాంటి దీర్ఘకాలిక పండ్లతోటలు ఉండటంతో భూగర్భజలాలు అడుగంటిపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. డ్రిప్, స్ప్రింక్లర్లు సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూక్ష్మసాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత ప్రయోజనం కలిగే పరిస్థితి నెలకొంది.