హోదా కాదు.. కనీసం ప్యాకేజి కూడా లేదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చినా, కొ్తత రాజధానికి శంకుస్థాపన చేసినా.. రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఆయన రెవెన్యూ లోటు గురించి మాట్లాడలేదని, పోలవరం ప్రాజెక్టునూ ప్రస్తావించలేదని అన్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలని, ఇక్కడ రాజధాని లేదు, పరిశ్రమలు లేవని అన్నారు. ఈ ప్రాంతాలకు ప్రత్యేక హోదా లేదు, కనీసం చంద్రబాబు, ఆయన మంత్రులు భజన కొట్టినట్లు కనీసం ప్రత్యేక ప్యాకేజి కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటేనని, జగన్ నిజాయితీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దీక్ష చేస్తే ఎల్లో మీడియా చంద్రబాబును హైలైట్ చేయడానికి రాష్ట్రాన్ని ముంచేయడానికి కూడా వెనకాడలేదని రోజా చెప్పారు. మీరంతా జగన్ వెంట ఉంటేనే ప్రత్యేక హోదా పోరాటానికి బలం వస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్రం ముందుకు రావాలి, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు రావాలి, పోలవరం పూర్తికావాలంటే జగన్ అడుగులో అడుగు వేయాలని ఆంధ్రప్రజలందరినీ కోరుకుంటున్నానని ఆమె అన్నారు.