కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
Published Tue, Mar 14 2017 9:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చింతలపూడి : కార్పొరేట్ శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జన ఆవేదన సదస్సులో భాగంగా పీసీసీ కార్యదర్శి ఎం.ధామస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తాపత్రయం అంతా తన పుత్రరత్నం లోకేష్ గురించేనన్నారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మోడీ మెప్పు కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. తుందుర్రు ఘటనలో మహిళలను తీవ్రంగా కొట్టి పోలీసులతో ఈడ్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా మంత్రి పీతల సుజాత కనీసం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం అన్యాయమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో లాభపడింది విజయ్ మాల్యా, అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు పంచి గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్‌లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20లోగా ప్రజా బ్యాలెట్‌ను పూర్తిచేసి పంపించాలని కోరారు. అనంతరం ఏలూరుచింతలపూడి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమర్‌జహాబేగ్, కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్‌సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement