నా ఆత్మహత్యకు చంద్రబాబే కారణం
♦ రుణ మాఫీ కాక మరో రైతు ఆత్మహత్య
♦ బాబు అబద్ధపు హామీల వల్లేనంటూ లేఖ
♦ వైఎస్సార్ జిల్లాలో ఘటన
రైల్వేకోడూరు అర్బన్: అధికారంలోకి రాగానే రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని ఇచ్చిన మాటను చంద్రబాబునాయుడు తప్పడం మరో రైతు ప్రాణాన్ని బలిగొంది. రుణమాఫీ కాలేదనే బెంగతో వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లెకు చెందిన ఓ రైతు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సీఎం చంద్రబాబునాయుడేనని రెండు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయానని, ఈ నేపథ్యంలో తన అప్పు పెరిగిపోయిందని, అది తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో వివరించాడు.
పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెంవారిపల్లెకు చెందిన కొలవలి సుబ్బారెడ్డి కుమారుడు సుబ్రమణ్యంరెడ్డి(45)కి రెండున్నర ఎకరాల పొలముంది. పంట పెట్టుబడికోసం బ్యాంకులో రూ.5 లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. తాము అధికారంలోకి రాగానే అప్పులు మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రకటించడంతో సంతోషపడ్డాడు. చంద్రబాబు సీఎం అయ్యాక తన బ్యాంకు అప్పు రూ.5 లక్షలు మాఫీ అవుతుందని ఎదురుచూశాడు. ఎంతకూ రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 9 గంటలకు రైల్వేకోడూరు పట్టణంలోని పగడాలపల్లి రహదారిలో మద్యంలో విషగుళికలు కలుపుకుని తాగాడు. పోలీసులు మృతుడి జేబులోంచి రెండు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య విజయమ్మ, కుమార్తె నవ్యా రెడ్డి, కుమారుడు హేమపాల్‌రెడ్డి ఉన్నారు.
సీఎం స్థాయి వ్యక్తులు అబద్ధాలు చెబితే ఎలా?
రుణమాఫీ చేస్తానని తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇవ్వడమేగాక.. రైతుల్ని అప్పు కట్టవద్దన్నారని, తీరా అధికారంలోకి వచ్చాక మాటతప్పారని సూసైడ్ నోట్‌లో సుబ్రమణ్యంరెడ్డి తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు. ‘‘ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఏం చేయగలరో అదే చెప్పాలి. ఆ స్థాయి వ్యక్తులు అబద్ధాలు చెబితే ఆ మాటలు నమ్మి ఎంతోమంది సామాన్యులు నష్టపోతారు. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆ మేరకు మ్యానిఫెస్టోలోనూ పేర్కొన్నారు.
చంద్రబా బు మాటలు నమ్మిన ఎందరో రైతులు క్షోభకు గురవుతున్నారు. స్వల్ప మొత్తం మాఫీ చేసి రుణమాఫీ చేశామని చెప్పుకోవడం తగదు. అది వడ్డీకి కూడా సరిపోలేదు. చంద్రబాబు మాటలు నమ్మినందుకు నా అప్పు పెరిగిపోయింది. తీర్చేమార్గం కనిపించక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకు చంద్రబాబే కారణం. ఇప్పటికైనా ఆయన రైతుల గురించి ఆలోచించాలి’’ అని అందులో పేర్కొన్నాడు. రైతులు అత్యాశ పడకూడదన్న సీఎం మాటల్ని సుబ్రమణ్యంరెడ్డి నోట్‌లో ప్రస్తావించాడు. రుణమాఫీ చేస్తామని ఆయన(బాబు) చెప్పారు కాబట్టి రైతులు ఆశపడ్డారని, అలా ఆశపడడం అత్యాశ కాదన్నాడు.