
దుబారాలో దూసుకుపోతున్న చంద్రబాబు
విజయవాడ: ఓ వైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దుబారా ఖర్చులో దూసుకుపోతున్నారు. కేవలం 26 కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించారు. తన అధికారిక నివాసం నుంచి చంద్రబాబు గురువారం ఉదయం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లారు. గతంలోనూ చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు మాత్రం తన రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ బాబు దుబారా ఖర్చు రూ.735 కోట్లుగా తేలింది. విదేశీ పర్యటనలు, రాష్ట్రంలోనే జిల్లాల పర్యటనల కోసం విమానాల ఖర్చులు, చంద్రబాబు నివాసాలు, కార్యాలయాల కోసం ఈ మేరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా చంద్రబాబు ఇవాళ ఆత్కూరు జడ్పీ పాఠశాలలో విద్యాంజలి కార్యాక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు.