
'నేను చచ్చినా చంద్రబాబు నాకు పదవి ఇవ్వరు'
బెళుగుప్ప(అనంతపురం): వివాదాస్పద వ్యాఖ్యలు అలవాటుగామారిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదేపని చేశారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకినని, కూలీ పనికి వెళ్లేవాళ్లు కూడా రోజుకు ఐదారు సార్లు టీ తాగుతున్నారని, అలాంటివారికి రూపాయికే కిలో బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తచేయలేరని, పోలవరం ప్రాజెక్టు గురించి పుట్టినప్పటినుంచి వింటున్నానని, అది పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదని జేసీ వ్యాఖ్యానించారు. బుధవారం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వరని, 'నేను చస్తేగానీ నాకు మంత్రి పదవి ఇవ్వరా?' అని చంద్రబాబుతో సరదాగా అన్నానని గుర్తుచేస్తూ.. తనకు అదృష్టం లేనందున మంత్రినికాలేకపోయానని, బాబుకు లక్ ఉంది కాబట్టే సీఎం అయ్యారని జేసీ చెప్పుకొచ్చారు.