– నిరుద్యోగులంతా ఉద్యోగుల కిందే లెక్క!
– అరకొర సంపాదన ఉన్నా అంతే సంగతులు
– పల్స్ సర్వేలో ఎంప్లాయ్‌గా నమోదుపై ఆందోళన
– చంద్రన్న బీమాతో లింక్ పెట్టేస్తున్న సిబ్బంది
– నిరుద్యోగ భృతి ఎగవేతకేనని యువత ఆవేదన
– శ్రీనివాసరావు... బీటెక్ పూర్తి చేశాడు. అతని వయసు 24 సంవత్సరాలు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. ఖాళీగా ఉండలేక స్థానికంగా ఉన్న ఓ చిరువ్యాపార సంస్థలో నెలకు రూ.5 వేల జీతానికే పనికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతను ఉద్యోగా? నిరుద్యోగా? అంటే... ప్రభుత్వం దృష్టిలో అతను ఉద్యోగే! పల్స్ సర్వేలో నమోదు చేసిన వివరాల ప్రకారం అతను ఉద్యోగి కాబట్టి... నిరుద్యోగి భృతి పొందడానికి అర్హత కోల్పోయినట్లే!
– రాజ్యలక్ష్మి... బీఎస్సీ, బీఈడీ చదివింది. కొన్నాళ్లు ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం చేసింది. తక్కువ జీతానికి పనిచేయలేక ఇంటి దగ్గరే ఉండిపోతోంది. ఇప్పుడామె ఉద్యోగా? నిరుద్యోగా? వాస్తవానికి ఆమె వివరాల్లో నిరుద్యోగిగానే పల్స్ సర్వేలో నమోదు చేయాలి. అలా చేస్తే నిరుద్యోగ భృతి వస్తుందో, లేదో తెలియదు కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న చంద్రన్న బీమాకు అర్హత లేకుండా పోతుంది.
ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేతో నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పటికే ఈ సర్వేపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగుల వర్గం కూడా చేరుతోంది. సర్వేలో కొన్ని వివరాలు తమ భవిష్యత్తు ప్రయోజనాలకు ముప్పు కలిగించేవిధంగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. గత సర్వేలకు భిన్నంగా ఆర్థిక, వ్యక్తిగత వివరాలు లోతుగా అంటే 52 అంశాలతో గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, వాటి నమోదు తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ బొటనవేలి ముద్ర తీసుకోవడం వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
– సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
జిల్లా పూర్తిగా వ్యవసాయాధారమైనది. మరోవైపు విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చే జిల్లా. దీంతో ఇంటికో రైతు ఉన్నట్లే... ఇప్పటి పరిస్థితుల్లో ఇంటికో నిరుద్యోగి కూడా ఉన్నారు. దాదాపు 28 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ జిల్లాలో 20 శాతం యువతే. ఆ లెక్కన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారే. అంటే దాదాపు 5.60 లక్షల మంది. వారిలో ప్రస్తుతం బీటెక్ తదితర డిగ్రీలు, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్నవారు 60 వేల వరకూ ఉంటారని అంచనా. ఇక 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు మధ్యనున్నవారంతా ప్రభుత్వ ఉద్యోగాల ఎదురుచూస్తున్నారు. కానీ గత మూడు నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేవు. దీంతో ఈ యువత అంతా ప్రచ్ఛన్న నిరుద్యోగులుగానే ఉన్నారు.
సర్వేతో గందరగోళం...
‘బాబు వస్తే జాబొస్తుంది... జాబు వచ్చే వరకూ నెలనెలా నిరుద్యోగ భృతి వస్తుంది’ అంటూ గత సాధారణ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా ఊరూరా ఊదరగొట్టారు. అందులో ఎంత వాస్తవమెంతో ఇప్పుడుప్పుడే యువత గ్రహిస్తున్నారు. రెండేళ్లు గడిచిపోతున్నా నోటిఫికేషన్లు అవిగో ఇవిగో అంటూనే నాయకులు చెబుతున్నారు. ఇక నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వే యువతను మరింత గందరగోళంలోకి నెట్టేస్తోంది. సర్వే వివరాల్లో ఉద్యోగి (ఎంప్లాయ్), నిరుద్యోగి (అన్‌ఎంప్లాయ్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఎంప్లాయ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే గవర్నమెంట్, ప్రైవేట్, ఆర్గనైజేషన్స్... అని మూడు సబ్ ఆప్షన్స్ వస్తున్నాయి. వాటిలో ఏ ఒక్కదానిలో క్లిక్ చేసినా ఉద్యోగి కిందే లెక్క. ప్రభుత్వం ఒకవేళ భవిష్యత్తులో నిరుద్యోగి భృతి ఇస్తే... వీరికి ఆ ప్రయోజనం దక్కదు. ఇక అన్‌ఎంప్లాయ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే స్టూడెంట్, హౌజ్‌వైఫ్ తదితర సబ్‌ఆప్షన్లు ఉన్నాయి. అంటే వారికి ఏ రకంగానైనా సంపాదన ఉండకూడదు.
యువత అంతా ఉద్యోగులే
సర్వే, చంద్రన్న బీమా ఏకకాలంలో చేస్తుండటంతో నిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పరిస్థితి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం రాక ఏదొక రకమైన తాత్కాలిక ఉపాధి వెతుక్కున్న వారంతా తమను ఉద్యోగులుగానే నమోదు చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించింది. ఏదొక సంపాదన ఉందని చెబితే వారిని ఉద్యోగిగానే సర్వేలో నమోదవుతుంది. కాదు తాము నిరుద్యోగి అని చెబితే... ఎలా బతుకుతున్నావో చెప్పాలనే సర్వే సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నిరుద్యోగి అని నమోదు చేస్తే చంద్రన్న బీమా పథకం వర్తించదని చెప్పేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక నిరుద్యోగులైనవారు తమను ఉద్యోగులుగా సర్వేలో నమోదు చేయించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో యువత దాదాపుగా ఉద్యోగులగానే పరిగణించాల్సి వస్తుంది. అయితే విద్యార్థులు లేదంటే ఉద్యోగులు ఉన్నప్పుడు జిల్లాలో ఎవ్వరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరమేమి ఉంటుందనేది ప్రభుత్వం లెక్క!
సంక్షేమ పథకాలకూ తూట్లు...
పల్స్ సర్వేలో సొంత ఇల్లు తదితర ఆస్తులతో పాటు వాహనం, టీవీ, ఫ్రిజ్, ఏసీ మిషన్ వంటి వస్తువల వివరాలను నమోదు చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రభుత్వం తమకు సబ్సిడీ వంటగ్యాస్, తెల్లరంగు రేషన్‌కార్డు, ఉచిత వైద్యసేవ వంటి సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రమాదం ఉందని ఇప్పటికే పలువురిలో ఆందోళన నెలకొంది. అలాగే తమ పిల్లలకు ఉపకార వేతనాలు కూడా రద్దు చేస్తారేమోననే భయం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఎంప్లాయ్ ఆప్షన్‌లో నమోదు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ నష్టం జరగవచ్చనే ఆందోళన యువతలో కనిపిస్తోంది. దీనికితోడు అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ సర్వేపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.