మాయ మాటలు చెప్పి నగదు హుష్!
* క్రెడిట్ కార్డు నుంచి డెబిట్‌కు నగదు బదిలీ చేయవచ్చంటూ బురిడీ
* పోలీసులకు ఫిర్యాదుచేసిన బాధితుడు
నరసరావుపేట టౌన్: క్రెడిట్ కార్డు నుంచి డెబిట్ కార్డులోకి నగదును బదిలీ చేసుకోవచ్చంటూ ఓ ఆగంతకుడు అధ్యాపకుడికి మాయమాటలు చెప్పి అతని ఖాతానుంచి రూ.1.45 లక్షల నగదును అపహరించిన సంఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఒన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలో ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 73963 51661 నుంచి గత రెండురోజులుగా ఫోన్ వస్తోంది. సోమవారం మరోమారు ఫోన్ చేసి తనపేరు వేణు అని, హైదరాబాదు గచ్చిబౌలీ ఐసీఐసీఐ బ్యాంకులో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నాడు. మీ క్రెడిట్ కార్డు నుంచి మీకున్న డెబిట్‌కార్డులోకి నగదును ఎటువంటి చార్జీలు లేకుండానే బదిలీ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. అతని మాటలను నమ్మిన ఆ అధ్యాపకుడు తన ఖాతా నంబరుతోపాటు క్రెడిట్ కార్డుపై నున్న నంబర్‌ను సైతం తెలియచేశారు. దీంతో ఆ ప్రబుద్ధుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తొలుత రూ.20 వేలు నగదును అధ్యాపకుడి ఖాతా నుంచి డ్రా చేశాడు. వెంటనే వెంకటేశ్వరరావు సెల్‌కు మెసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాలో ఉండాల్సిన రూ.1.45 లక్షలు నగదు మాయమైనట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయినట్లుగా భావించి జరిగిన విషయాన్ని ఎస్‌ఐ లోకనాథంకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.