మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తపై చీటింగ్ కేసు
అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్‌గుప్తపై కర్నూలు జిల్లా నంద్యాలలో చీటింగ్ కేసు నమోదయింది.
నంద్యాల: అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్‌గుప్తపై కర్నూలు జిల్లా నంద్యాలలో చీటింగ్ కేసు నమోదయింది. రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. మధుసూదన్ గుప్త నంద్యాలలోని చక్కెర ఫ్యాక్టరీని ఏడాదిన్నర క్రితం మూసివేశారు. ప్రకాశం జిల్లా ముళ్లమారు మండలం శరికరాపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రామాంజనేయులు, అతని స్నేహితులు చక్కెర ఫ్యాక్టరీ ఇనుము, తుప్పును రూ.10కోట్లకు కొనుగోలు చేయడానికి గుప్తతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రూ.52లక్షల నగదును, రూ.2కోట్ల చెక్కులను అందజేశారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఇనుము, తుప్పును గుజరాత్‌కు చెందిన మరో సంస్థకు విక్రయించారు. దీంతో రామాంజనేయులు, అతని స్నేహితులు మధుసూదన్ గుప్తను నిలదీయగా అగ్రిమెంట్‌తో సంబంధం లేదని, అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితులు సోమవారం స్థానిక చెరువు రైతులు బంగారురెడ్డి, నాగేశ్వరరెడ్డి, పాములేటి, శ్రీనివాసులుతో కలిసి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వీరిచ్చిన ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తపై పోలీసులు 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.