
ఆ పసికందు ఇక లేదు
అనంతపురం సిటీ: ధర్మవరం రూరల్ పరిధిలోని నగటూరు పోతులయ్య ఆలయం గుడి మెట్లపై శుక్రవారం సాయంత్రం చిక్కిన శిశువు అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాత్రి 8 గంటలకు శిశువును ధర్మవరం పోలీసులు అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో చేర్పించారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించినట్లు కనిపిస్తున్న శిశువుకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు.
శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ పసికూన శ్వాస ఆగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఉదయమే వార్డుకు వెళ్లి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి ఆస్పత్రి ఆవరణలో లభించిన చిన్నారికి మెరుగైన వైద్య సేవలందించాలని డాక్టర్ సుధీర్‌ను ఆదేశించారు.