అనంత ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం | child missing in anantapur government hospital | Sakshi
Sakshi News home page

అనంత ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం

Published Fri, Apr 14 2017 11:32 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

child missing in anantapur government hospital

- సెక్యూరిటీ సిబ్బంది చొరవ
- బాలిక ఆచూకీ కనుకొని కన్నవారికి అప్పగించిన వైనం

అనంతపురం మెడికల్‌ : బిడ్డ కనిపించకపోవడంతో ఆ అమ్మ కన్నీరు పెట్టింది. తన బిడ్డ ఏడుస్తుంటే ఆమె తల్లి విలవిల్లాడింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో శుక్రవారం ఓ చిన్నారి అదృశ్యం కావడంతో గంటన్నర పాటు మాతృ‘హృదయాలు’ తల్లడిల్లిపోయాయి. శింగనమల మండలం మదిరేపల్లికి చెందిన శకుంతల, వీరనారప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఓ కుమార్తెకు కొన్ని రోజులుగా జ్వరం వస్తుండడంతో గురువారం సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో చేర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం నీటి కోసం ఆస్పత్రి ఆవరణలోని వాటర్‌ప్లాంట్‌ వద్దకు ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చింది. రద్దీ ఉండడంతో కాసేపటి తర్వాత బాటిల్‌లో నీరు పట్టుకుంది. ఆ తర్వాత కుమార్తె కన్పించకపోవడం కంగారు పడింది.

వెంటనే వార్డు వద్దే ఉన్న తన తల్లి శాంతమ్మతో పాటు భర్త, కుటుంబ సభ్యులకు తెలిపింది. వారంతా గాలించారు. అర గంట వెతికినా కన్పించకపోవడంతో ఔట్‌పోస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బిడ్డ ఆస్పత్రి బయటకు వెళ్లిందేమోనని వీరనారప్ప వెతకసాగాడు. ఈ క్రమంలో శకుంతల కన్నీరు పెడుతుంటే ఆమె తల్లి శాంతమ్మ కూడా రోదించింది. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ ఇర్ఫాన్, గార్డులు జయచంద్ర, రఫీ, శీన ఆస్పత్రి ఆవరణతో పాటు, వార్డుల్లో గాలించారు. గంట తర్వాత గైనిక్‌ వార్డు వద్ద ఓ చిన్నారి ఒంటరిగా కన్పించడంతో తీసుకుని వచ్చారు. ఆ పాప తప్పిపోయిన చిన్నారేనని గుర్తించి శాంతమ్మకు అప్పగించారు. ఈ దృశ్యాన్ని క్యాజువాలిటీ సమీపంలోంచి గమనించిన శకుంతల పరుగున వచ్చి బిడ్డను హత్తుకుంది. సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement