ప్రతిభను ప్రోత్సహిస్తే ఏపీ నంబర్‌వన్
-
సినీ నటుడు భానుచందర్
-
ఘనంగా మదర్‌థెరిసా జయంతి వేడుకలు
నెల్లూరు(బారకాసు) : వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్న వారిని ప్రోత్సహిస్తే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది దేశంలో నంబర్‌వన్‌గా గుర్తింపు పొందుతుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్ అన్నారు. పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని టౌన్‌హాల్ (పురమందిరం)లో నిర్వహించిన మదర్‌థెరిసా 106వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళారంగాన్ని కాపాడుకుంటేనే సమాజం అన్ని విధాల అభివృద్ది చెందుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళారంగమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఎందరో ప్రతిభ కలిగిన వారున్నారన్నారు. కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ అధినేత గాలి కిరణ్‌కుమార్ అభినందనీయుడని కొనియాడారు. దర్శకుడు పురుషోత్తంరావు మాట్లాడుతూ కళారంగమంటే తనకెంతో ఇష్టమని అందుకనే సినిమా రంగంలోకి ప్రవేశించానన్నారు. భానుచందర్ తననెంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కనుమరుగవుతున్న కళారంగాన్ని కాపాడలనే తపనతోనే తన వంతు ప్రోత్సహం అందిస్తున్నానని చెప్పారు. అనంతరం భానుచందర్, పురుషోత్తంను గజమాల, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో చిత్త శుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న సీతారామయ్య, శ్రీరామప్రసాద్, యంట్రపాటి వెంకటేశ్వర్లు, కాలిశెట్టి శ్రీనివాసులు, మామిడి పుష్పకళ, పఠాన్ యస్దాన్‌ఆలి, వివిధ రంగాల్లో తమ ప్రతిభన కనబరుస్తున్న సర్వేపల్లి రామ్మూర్తి, విష్ణువర్దన్, కాలిశెట్టిలకు పురస్కారాలు అందజేశారు. అమరావతి కృష్ణారెడ్డి పేద వృద్ధ కళాకారులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. తొలుత నిర్వహించిన పాటలు, డ్యాన్సు పోటీల్లో విజేతలైన వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను ఆలరించాయి. కార్యక్రమంలో కావలి మార్కెట్ కమిటి చైర్మన్ దేవరాల సుబ్రమణ్యంయాదవ్, శ్రీడ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీనివాసులురెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు, గడ్డం సుధాకర్‌రెడ్డి, ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు, రిటైర్డ్ లెక్చరర్ డేగా రామచంద్రారెడ్డి, పాటూరు శ్రీనివాసులు, ఎస్.వి రమేష్, చక్రధర్, అమానుల్లాఖాన్, తుమ్మల శ్రీనివాసులురెడ్డి, బయ్యా వాసు తదితరులు పాల్గొన్నారు.