నగర ప్రథమ పౌరుడు మనోడే
మేయర్‌గా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్ మేయర్ పదవి మన జిల్లాకే దక్కింది. జిల్లాలోని చర్లపల్లి డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బొంతు రామ్మోహన్ నగర ప్రథమపౌరుడిగా గురువారం బాధ్యతలు దక్కించుకున్నారు. గతంలో మేయర్‌గా వ్యవహరించిన తీగల కృష్ణారెడ్డిది సరూర్‌నగర్ మండలం మీర్‌పేట స్వగ్రామం కాగా, బొంతు రామ్మోహన్‌ది వరంగల్ జిల్లా. అయితే, ఎన్నికలకు ముందు ఆయన చర్లపల్లికి మకాం మార్చారు. ఈ క్రమంలోనే మేయర్ పదవిని కట్టబెట్టాలని భావించిన టీఆర్‌ఎస్ నాయకత్వం ఆయనకు కార్పొరేటర్ టికెట్ కేటాయించింది.
ఈ ఎన్నికల్లో ఆయన విజయ బావుటా ఎగురవేశారు. టీఆర్‌ఎస్ విశ్లేషకుల ఊహలకందని స్థాయిలో సీట్లను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో మేయర్ కుర్చీ ఆయనకు లభించింది. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో బొంతు కీలక భూమిక పోషించారు. యువతకు పెద్దపీట వేయాలని భావించిన సీఎం కేసీఆర్.. యువనేతగా రాణించిన రామ్మోహన్‌కు నగర పాలనాపగ్గాలు అప్పజెప్పారు.