కమీషన్ల కోసమే ప్యాకేజీకి చంద్రబాబు సై
– ఏపీ అథోగతికి ఆయనే కారణం
– మాటలు మార్చడంలో వెంకయ్య దిట్ట
– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేకుల ధ్వజం
నూజివీడు :
రాష్ట్రం అథోగతి పాలవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని డీసీసీ అధ్యక్షులు ధనేకుల మురళీ మోహన్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడ జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ధనేకుల మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముందూ, వెనుక ఆలోచించకుండా విభజన చేయమని లేఖ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి అంగీకరించడం చారిత్రక తప్పిదమన్నారు. విభజన బిల్లు సమయంలోనే రాష్ట్రానికి ఏం కావాలనే దానిపై చంద్రబాబు నోరు మెదపకుండా నేడు ప్యాకేజీల కోసం అర్రులు చాచడం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది కేవలం కేంద్రం ఇచ్చే డబ్బులను కమీషన్ల రూపంలో పంచుకోవడానికే తప్పితే రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఏం సాధించారని ఢిల్లీలో సన్మానాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇష్టారాజ్యంగా మాటమారుస్తారని ప్రజలకు అర్థమైందన్నారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి వింతా సంజీవరెడ్డి, బీడీ రవికుమార్, పాతూరి రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పరిమి సాగర్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చాట్ల విలాస్‌బాబు తదితరులు మాట్లాడుతూ టీడీపీ బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.