వాగ్దానవర్షం
-
నగర కన్వెన్షన్ సెంటర్, ఇతర పనులు పూర్తి చేస్తామని సీఎం ప్రకటన
-
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
-
లబ్ధిదారులకు వాంబే గృహాల పంపిణీ
-
ఆలస్యంగా ప్రారంభమైన పర్యటన
సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం రూరల్:
హామీల బాబు చంద్రబాబు మరోసారి వాగ్దాన వర్షం కురిపించారు. గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరాభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తామని మరో సారి వాగ్దానం చేశారు. నగర కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, అఖండగోదావరి ప్రాజెక్టు, పుష్కర వనం అభివృద్ధి... వీటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి అంత్యపుష్కరాల ముగింపు సందర్భంగా గురువారం పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 4200 ఇళ్లకు, ఆవ చానల్ నుంచి ఎన్‌హెచ్–16 వరకు రూ.490 లక్షలతో 100 అడుగుల రోడ్డుకు శంకుస్థాపనలు చేశారు. ఇన్నీసుపేట నుంచి ఎస్‌టీపీ ప్లాంట్ వరకు రూ.683 లక్షలతో ఆర్‌సీసీ మేజర్ డ్రైనేజీకి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రామకృష్ణ థియేటర్ వెనుక ఆవ రోడ్డులో నిర్మించిన 2,256 వాంబే గృహాలను ప్రారంభించారు. లాంఛన ంగా పది మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చెరుకూరి కల్యాణ మండపంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, డైరెక్టర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు మాట్లాడుతూ.. లబ్ధిదారులు తాము కట్టిన రూ.60,800 మించి ఇంక ఒక్క రూపాయి కూడా కట్టనవసరంలేదన్నారు. సిమెంటు రోడ్లు, నీటి వసతి తదితర మౌలిక వసతులకు రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మధురపూడి విమానాశ్రయాన్ని విస్తరించేందుకు రూ. 240 కోట్లతో భూమిని సమీకరించినట్టు తెలిపారు. గోదావరి అఖండ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేస్తామని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. నగరంలో స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి ఆవ రోడ్డు వరకు ప్లైఓవర్ నిర్మాణానికి, ఆవ, నల్లా చానెల్ ద్వారా వస్తున్న మురుగునీటిని శుద్ధి చేసి టెన్నెల్స్ ద్వారా ధవళేశ్వరం వద్ద గోదావరి దిగువన వదిలేందుకు నిధులు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కోరగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న సీఎం త్వరలో చేపడతామన్నారు. గృహ లబ్ధిదారురాలు యర్రబల్లి చిన రాజలమ్మ తన కుమార్తె ఝాన్సీ విద్యుత్ షాక్‌తో రెండు చేతులు కోల్పోయిందని, ఆసరా చూపించాలని వేడుకోవడంతో రూ. లక్ష సహాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో హుకుంపేట గ్రామంలో జరగాల్సిన కార్యక్రమం రద్దు అయింది. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల, కిమిడి మృణాలిని, ఎంపీ మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, బొడ్డు బాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, పులవర్తి నారాయణమూర్తి, మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ డైరెక్టర్ కందుల కొండయ్యదొర, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, నగరపాలకసంస్థ కమిషనర్ విజయరామరాజు, గృహనిర్మాణసంస్థ ప్రాజెక్టు డైరెక్టరు డి.సెల్వరాజ్, ప్రజాఆరోగ్యశాఖ ఎస్‌ఈ ఎం.శ్రీమన్నారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.