సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఓవైపు.. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన చేసిన ప్రకటన మరోవైపు ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. బీసీలకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని కొంతకాలం నుంచి చెప్తున్న బీజేపీ అధిష్టానం.. అధికారికంగా బీసీ ఎజెండాను ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో ఆ వర్గాలు ఎంతమేర ప్రభావితం అవుతాయి, ఏ మేర ఓట్లుగా మారుతాయని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందే బీసీని సీఎం చేస్తామని ఇలా ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమేనని నేతలు అంటున్నారు. అంతేకాదు ఆ బీసీ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
బీజేపీ చిత్తశుద్ధిని చాటేలా..
2014లోనే ఓబీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధాని చేయడం, 2019లోనూ ఆయననే కొనసాగించడం, మోదీ కేబినెట్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా 27 మంది బీసీ, ఓబీసీ మంత్రులు, ఎస్సీ,ఎస్టీలకూ సముచిత సంఖ్యలో మంత్రి పదవులను బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన పార్టీ చిత్తశుద్ధిని చాటేలా ఉందని అంటున్నాయి.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్‌షా పలువురు ముఖ్యనేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి అమిత్‌షాతో కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ వేర్వేరుగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌షాను కలసి ‘ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్ట్’ప్రతిని అందజేశారు. దానిని జాతీయ నాయకత్వం పరిశీలించి ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment