ప్రజలకు 2వేల కష్టాలు
Published Tue, Nov 22 2016 3:04 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన రూ.2వేల నోటు అలంకారప్రాయంగా మారుతోంది. ఎక్కడా చిల్లర దొరకడంలేదు. చివరకు బ్యాంకుల్లోనూ తీసుకోవడానికి సిబ్బంది విముఖత చూపుతున్నారు. ఏం చేయాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
తిరుపతి (అలిపిరి): పెద్దనోట్ల రద్దుతో జిల్లా ప్రజలు సవాలక్ష కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి రూ.2వేల నోటు పొందిన వారికి వింత అనుభవం ఎదురవుతోంది. 10వ తేదీ బ్యాంకులకు రూ.2వేల నోట్లు చేరాయి. వాటిని సొంతం చేసుకోవాలని యువకులు బ్యాంకుల ముందు బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షించారు. కలర్‌ఫుల్ లుక్‌తో మెరిసిపోయే రూ.2వేల నోట్లు చేతికి రావడంతో బ్యాంకుల ముందే సెల్ఫీలు దిగి సోషియల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ తంతు మూడు రోజుల పాటు కొనసాగింది. కాలం గడిచే కొద్ది రూ.2వేల నోటు గుదిబండగా మారింది. ఒక వైపు రూ.100 నోట్ల కొరత.. మరో వైపు కొత్త పెద్దనోటు రూ.2వేలకు చిల్లర దొరక్క అల్లాడాల్సి వస్తోంది.
నిరాకరణ: బ్యాంకుల్లో రూ.2వేల నోటు తీసుకోవడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. నోటును చిల్లర దుకాణాలకు తీసుకెళ్లినా అదే పరిస్థితి. నో చేంజ్ అంటూ తిప్పి పంపుతున్నారు. ఖాతాదారుల ఇళ్లలో రెండువేల నోటు అలంకారప్రాయంగా మారుతోంది.
కష్టాలు కంటిన్యూ: జిల్లాలోని పలు ఏటీఎం కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి రూ.2వేల నోట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు చిల్లర నోట్లు వస్తాయని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డ్రా చేస్తే రూ.2వేల నోటు వస్తోంది. దీంతో ప్రజలకు మరింత చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఆర్బీఐ నుంచి తక్కువ మొత్తంలో రూ.100 నోట్లు అందుతుండడంతో చిల్లర కొరత ఏర్పడుతోంది. బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు.
అమ్మో రూ.2వేలా!
రూ.2వేల నోటు పేరు చెబితే భయమేస్తోంది. చిల్లర దుకాణాలకు వెళితే నో చేంజ్ అంటున్నారు. చిన్నాచితక షాపులకు వెళితే రూ.200 కొంటే రూ.1800 చిల్లర ఎలా ఇచ్చేదంటూ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కొత్త నోటు మాకొద్దంటూ పలువురు తిప్పి పంపుతున్నారు.
- దొరస్వామిరెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి
బీరువాలో దాచుకోవాల్సిందే
కొత్త రూ.2వేల నోటును బీరువాలో దాచుకోవాల్సిందే. రద్దరుున రూ.1000 నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉండేది. ఇప్పడు రూ.2వేల నోటు అంటే చిల్లర దుకాణాల్లో తీసుకోవడంలేదు. కూరగాయలు కొందామని మార్కెట్‌కు వెళితే రూ.2వేల నోటుకు చిల్లర ఎక్కడి నుంచి తేవాలంటూ ప్రశ్నిస్తున్నారు. - గోవిందయాదవ్, వ్యాపారి, తిరుపతి
Advertisement
Advertisement