'అనంత' కరువుపై నిర్లక్ష్యం
– వామపక్ష నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్ : జిల్లాలో తీవ్ర కరువు నెలకొన్న పరిస్థితుల్లో, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, చేతులు దులుపుకుందే తప్ప, సహాయక చర్యల ఊసెత్తడం లేదని మండిపడ్డారు. ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచుతామని, జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. జిల్లాలో నెలకొన్న కరువు, ప్రభుత్వం తీరుపై ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను విలేకరులకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి వివరించారు.
50 ఏళ్లలో ఎన్నడూ రానంత కరువు జిల్లాలో ప్రస్తుతం నెలకొందన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడంతో ప్రభుత్వం సరిపెట్టిందే తప్ప సహాయక చర్యలు చేపట్టి రైతులను, కూలీలను ఆదుకోవడాన్ని విస్మరించిందని దుమ్మెత్తిపోశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు కృష్ణజలాలను తరలించి గొప్పలు చెప్పుకునేందుకు జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వస్తున్నారనే తప్ప రైతాంగాన్ని ఆదుకునేందుకు కాదని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య దిశగా రైతుల వెళ్లకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపడంలోనూ, వలసలు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారులు కూడా ప్రభుత్వం అడుగులకు మడుగుల వత్తడం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ధ్వజమెత్తారు.
రైతులకు అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని, ఉపాధి పనిదినాలు 200 రోజులకు పెంచి, రోజు కూలి రూ.300 ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, తండా ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. జిల్లా అధికార యంత్రాగం పూర్తిగా కరువు సహాయక చర్యలకు ఉపక్రమించాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు.
శీతాకాల సమావేశాల్లో తొలి రోజునే జిల్లా కరువుపై చర్చ సాగించి ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయాలన్నారు. లేని పక్షంలో ఎమ్మెల్యేల నివాసాల వద్ద ఆందోళన చేపడతామన్నారు. కరువు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఐదు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు సి.జాఫర్, పి.నారాయణస్వామి పాల్గొన్నారు.