అమరేశ్వర ఆలయానికి అనుబంధంగా మద్రాస్లో ఉన్న 471 ఎకరాల సదావర్తి సత్రం భూములను టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గుంటూరు: అమరేశ్వర ఆలయానికి అనుబంధంగా మద్రాస్లో ఉన్న 471 ఎకరాల సదావర్తి సత్రం భూములను టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రూ. 6 కోట్ల విలువైన ఎకరా భూమిని రూ. 27 లక్షలకే వేలం వేయడం వల్ల దోపిడీకి తెరతీసిందని మండిపడ్డారు. బుధవారం ఏపీసీసీ నేతలు గవర్నర్ను కలిశారు. టీడీపీ నేతలకే ఈ భూములను ధారాదత్తం చేసేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఈ అక్రమ వేలాన్ని రద్దు చేయాలని, రూ. 5 వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం ఇచ్చామని రఘువీరా చెప్పారు. దేవుడి భూములను వేలం వేసే అధికారం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రూ. 5 వేల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. వేలానికి సంబంధించి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా టీడీపీ నేతలకు ఈ భూములను కట్టబెట్టేలా వేలం ప్రక్రియ సాగిందని రఘువీరా దుయ్యబట్టారు. దేవుడి భూముల ఆస్తులను రక్షించేందుకు ఏపీలోనూ, తమిళనాడులోనూ కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సీ రామచంద్రయ్య చెప్పారు.
అదేవిధంగా ముద్రగడ దీక్షపై ప్రభుత్వ తీరుపైనా ఏపీసీసీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభంను పరామర్శించనీయకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ముద్రగడ కుమారుడిని పోలీసులు చితకబాదడం అమానుషమని అన్నారు. అసలు ముందుగా అరెస్ట్ కావాల్సింది చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఏపీ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీ రామచంద్రయ్య విమర్శించారు.