'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం మోసపూరితమైందని ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో ఓ హోటల్ జరిగిన కార్యక్రమంలో బాక్సైట్ తవ్వకాలపై వాస్తవ పత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ...ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 97 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై బహిరంగ చర్చకు రావాలని సీఎంకు ఆయన సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమానికి మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఆదివాసీల హక్కుల దినోత్సవం రోజున చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేయడం విచిత్రమైన పరిస్థితికి నిదర్శనమని నాదెండ్ల వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో తనకు ప్రయోజనం చేకూర్చే కంపెనీల కోసం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను సైతం సవరణ చేసేందుకు చంద్రబాబు గతంలో ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని గతంలో నాలుగు సార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారని నాదెండ్ల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పెద్దకే ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.