
గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ, ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు
జానారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆగ్రహం
• మెతక వైఖరితో పార్టీకి నష్టం
• టీఆర్‌ఎస్‌పై దూకుడుగా పోవాలన్న సభ్యులు
• ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం దిశగా చర్చ!
సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్‌ఎస్ వైఫల్యాలపై, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడదామంటే మాకు మైకు ఇవ్వరు. మీకు మైకు ఇచ్చినా టీఆర్‌ఎస్‌పై మీరు గట్టిగా మాట్లాడరు. టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక చర్యలను, వైఫ ల్యాల గురించి మాట్లాడకుంటే ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి ఏ సంకేతాలు వెళ్తాయి?’’ అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానా రెడ్డిని పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు నిలదీసినట్టు తెలిసింది. సీఎల్పీ నేతే మెతక వైఖరితో ఉంటే పార్టీకి నష్టమని వారు అభిప్రాయపడ్డారు. ‘‘శాసనసభాపక్ష నేతగా మీరు గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడూ మెతకగా మాట్లాడితే ప్రయోజనం లేదు.
టీఆర్‌ఎస్ దూకుడును అడ్డుకోకుంటే ప్రజ ల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి’’ అని కరా ఖండిగా చెప్పినట్టు తెలిసింది. శుక్రవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభ మవుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం అసెం బ్లీ హాలులో సమావేశమైంది. పార్టీ ఫిరా యింపులు, రైతులకు పంటరుణాల మాఫీ టీఆర్‌ఎస్ అవినీతి, గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌పై సిట్ విచారణ, హామీల అమ లులో వైఫల్యం వంటి కీలకమైన అంశాల్లో దూకుడుగా వ్యవహరించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ఏకపక్షంగా సభను నడుపుకుందని, మాట్లాడటంలో కాంగ్రెస్ విఫలమైందనే ప్రచారం మంచిది కాదని జీవన్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగు లేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అభిప్రాయ పడినట్టు సమాచారం.
జానారెడ్డి బదులిస్తూ, ‘సభ్యులు ఎవరైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడతామంటే నేను వద్దన్నానా’ అని అన్నారని తెలిసింది. దాంతో, ‘మేం మాట్లా డదామంటే మాకు మైక్ ఇవ్వరు. ఇచ్చినా అసలు విషయం ప్రస్తావించగానే మైక్ కట్ చేస్తారు. మీకు మైక్ ఇచ్చినా మీరేమో మాట్లా డరు. ఇలాగైతే ఎలా?’ అంటూ పలువురు సభ్యులు నిలదీసినట్టు తెలిసింది. వీలైనంత మంది సభ్యులకు మైక్ ఇవ్వాలని అడుగు తానని జానా బదులిచ్చినట్టు సమాచారం.
‘నయీం’పై పట్టుబడదాం
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ ఉదంతంపై సిట్ విచారణ జరిగిన తీరుపై సభలో గట్టిగా మాట్లాడాలని పలువురు సభ్యులు జానాకు సూచించారు. నయీం దగ్గర భారీగా దొరికిన నగదు డంప్, డైరీ ఏమయ్యాయో అడగాలని, డైరీని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయాలని కోరారు. నయీంతో సంబంధా లున్న అధికార టీఆర్‌ఎస్ నేతల పేర్లు ఎందుకు బయటకు రావడం లేదని, వారి నెందుకు అరెస్టు చేయడం లేదని కూడా టీఆర్‌ఎస్‌ను సభలో నిలదీయాలని అన్నారు. టీఆర్‌ఎస్ నేతల ప్రమేయం వల్లే నయీం కేసును బలహీనం చేశారని, దీనిని సభలోనే నిలదీయాలని నిర్ణయించారు. సాగు ప్రాజె క్టులు, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని, వాటి టెండరు డాక్యుమెంట్లను సభలో పెట్టాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు.
దీనితోపాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అంశంపై చర్చ జరిగింది. అప్పుడు ఫిరాయింపులపై కూడా స్పష్టత వస్తుందని కొందరు సూచించారు. సభ్యుల సంఖ్యను బట్టి సభలో మాట్లాడే సమయం వస్తుందని, టీఆర్‌ఎస్‌కన్నా తక్కువ సభ్యుల సంఖ్య ఉండటం వల్ల కాంగ్రెస్ వాదనకు సమయం దొరకదని, కాబట్టి అవి శ్వాసం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదేమో నని జానా అభిప్రాయపడ్డారు. అయితే సభ ప్రారంభమైన రెండుమూడు రోజుల తర్వాత, ప్రభుత్వం సభను నిర్వహించే తీరును చూసి అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
అన్ని అంశాలపై సమగ్రంగా చర్చ జరిగేదాకా సమావేశాలను నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఎన్ని రోజులన్న దానితో సంబంధం లేకుండా అన్ని అంశాలపై సమగ్ర చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. సీఎల్పీ భేటీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీఏసీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై నిలదీద్దాం: భట్టి
సీఎం కేసీఆర్‌కు మాటలతో కాలం వెళ్ల దీయడం అలవాటని భట్టి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఆయన ప్రజాస్వామ్యవాది ఎలా అవుతారని ప్రశ్నిం చారు. సీఎల్పీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వకుంటే, తప్పించుకునే ప్రయత్నం చేస్తేనే వెల్‌లోకి పోతాం. వెల్‌లోకి పోతే సస్పెండ్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్ధం’’ అంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో మోసాన్ని సభలో ఎండగడతామని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. ‘‘ప్రజా సమస్యలను ప్రస్తావించడమే అరాచకమంటే ఎలా? ప్రజా సమస్యలే మా ప్రధాన ఎజెండా. వాటిపై సభలోనే చర్చించి, పరిష్కారానికి పట్టుబడతాం. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఉద్యోగుల పీఆర్సీ వంటివాటిపై నిలదీస్తాం. ఇందుకోసం అవసరమైతే సభలో అన్ని పార్టీలతో సమ న్వయం చేసుకుంటాం. సభలో చర్చ జరిగే తీరును బట్టి అవిశ్వాసంపై ఆలోచిస్తాం’’ అని భట్టి స్పష్టం చేశారు.