
ఎన్నేళ్లలో రోడ్లు పూర్తి చేస్తారు?
సభలో సర్కారును నిలదీసిన జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికలు, ప్రస్తుతం నిధులు కేటాయిస్తున్న తీరు చూస్తుంటే వాటి పూర్తికి కనీసం మరో తొమ్మిదేళ్లు పట్టేలా ఉంది. రోడ్ల నిర్మాణాలను ఎన్నేళ్లలో పూర్తి చేస్తారో స్పష్టంగా చె ప్పాలి’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జిలపై అసెంబ్లీలో లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వమిచ్చిన రూ.21 వేల కోట్ల ప్రణాళికలు గందరగోళంగా ఉన్నాయన్నారు. ‘రోడ్ల నిర్మాణాన్ని మరో తొమ్మిదేళ్లలో పూర్తి చేస్తారా? పదిహేనేళ్లలోనా? లేక పాతికేళ్లలోనా? అప్పటివరకు మీరే అధికారంలో ఉంటారా? మరో రూ.లక్ష కోట్లతో 50 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలిస్తే ఎలా గందరగోళంగా ఉంటుందో రోడ్ల ప్రణాళికా అలాగే ఉంది. రోడ్లను ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పండి. అప్పుడే ప్రజలకేం చెప్పాలో, ప్రభుత్వానికి ఏం సలహాలివ్వాలో ఇస్తాం. అసలు ఇప్పటిదాకా ఎన్ని రోడ్లకు ప్రణాళికలు వేశారు? ఎన్ని మంజూరు చేశారు? ఎన్నింటికి టెండర్లు పిలిచారో వివరించండి. ఆ రోడ్లకు ఏటా ఎన్ని నిధులు కేటాయిస్తారో, ఎన్ని పూర్తి చేస్తారో ప్రణాళికబద్ధంగా చెప్పాలి. వచ్చే బడ్జెట్‌లో పెట్టాలి. జాతీయ రహదారులకయ్యే రూ.14 వేల కోట్లలో కనీసం రూ.3 వేల కోట్లయినా తేవాల్సి ఉండగా 450 కోట్లు మాత్రమే తెచ్చారు’ అని అన్నారు. హైవేలపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మె ల్యే చిన్నారెడ్డి అన్నారు.
సద్వినియోగపరచండి: కిషన్‌రెడ్డి
కేంద్ర మంత్రి గడ్కారీకి రాష్ట్ర పరిస్థితి తెలుసు గనుకే రోడ్ల అభివృద్ధికి అడిగినన్ని నిధులిస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత జి.కిష న్‌రెడ్డి అన్నారు. కేంద్ర సాయాన్ని సద్వినియోగపరచాలని సూచించారు. కాంగ్రెస్ హ యాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. గోదావరిపై ఇన్‌లాండ్ వాటర్ సిస్టం రావాలన్నారు. పలు పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరారు.
‘పథకం మాది...ప్రచారం టీఆర్‌ఎస్‌ది’
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్న రూ.5 భోజన పథకంపై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ‘మా హయాంలో ప్రారంభించిన పథకం అ మలు తీరు గురించి తెలుసుకునేందుకు కె.జానారెడ్డి, నేను రూ.5 భోజనాన్ని తెప్పించుకుని భేష్ అంటే.. దాన్ని టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాడుకొని మెజారిటీ సీట్లు కొట్టేసింది. భోజనం మాకు.. సీట్లు వారికి’ అని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి అనడంతో సభ్యులంతా ఘొల్లున నవ్వారు. ‘కాంగ్రెస్ టైమింగ్ మాకు అలా కలిసొచ్చింది’ అని కేటీఆర్ అనడంతో సభలో మళ్లీ నవ్వులు పూశాయి.
త్వరలో వీధి అమ్మకందారుల బిల్లు: కేటీఆర్
త్వరలో వీధి అమ్మకందారుల బిల్లును తీసుకురానున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీన్ని త్వరలోనే కేబినెట్‌కు పంపించి వీలునుబట్టి ఈ సమావేశాల్లోనే బిల్లును తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ అంశంపై కొంపల్లి యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
విద్యుత్ కొనుగోళ్లన్నీ బహిర్గతమే: జగదీశ్
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లన్నీ బహిర్గతమేనని, కొనుగోళ్లలో పారదర్శ కతకు పెద్దపీట వేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మం డలి ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్‌అలీతో పాటు ఆ పార్టీ సభ్యుడు పొంగులేటి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఉపాధి కల్పనలో ఇబ్బందులను అధిగ మించడం, పారిశ్రామిక రంగాలను ఆదుకోవడం, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ విద్యుత్ దొరికినా కొనుగోలు చేయాలన్న సీఎం ఆదేశాల మేరకే బహిరంగ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోళ్ల నిర్ణయం జరిగిందన్నారు.