కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయాలి
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు(న్యూసిటీ) : కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం కర్నూలులోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సీపీఐ జిల్లా నాయకుడు కె.జగన్నాథం, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.జె.రెడ్డి ..దీక్షలకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.ఎ.నవీన్‌కుమార్, ఎన్.బ్రహ్మేశ్వర్లు, డి.కె.ఈశ్వర్, డి.వి.రవికుమార్, నాగరాజరెడ్డి, చాంద్ బాషా, కల్పన, సునిత, రఫీవుద్దీన్, కిషోర్‌కుమార్, సోమేష్, మల్లికార్జున స్వామి, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.