భగ్గుమన్న దళిత గుండె
♦ చంద్రబాబు వ్యాఖ్యలపై రగిలిన ఎస్సీ,ఎస్టీ నేతలు
♦ టంగుటూరులో పోలీసులకు ఫిర్యాదు
♦ చీరాలలో సీఎం దిష్టిబొమ్మ దహనం,
♦ తోపులాట, మానవహారం
♦ కోర్టులు సుమోటాగా తీసుకోవాలి
♦ అట్రాసిటీ కేసు కింద బాబును అరెస్టు చేయూలి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దళితులు భగ్గుమన్నారు. తమను కించపరిచేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, ఎస్సీలలో పుట్టినందుకు తాము గర్వపడుతున్నామని వారు పేర్కొన్నారు. కోర్టులు సుమోటోగా తీసుకుని సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై టంగుటూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చీరాలలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులు, ప్రజా సంఘాల నాయకుల మద్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. సగం తగలబెట్టిన దిష్టిబొమ్మను ఆర్పేందుకు ఏఎస్సై స్వామి యత్నించగా ఆయనకు నిప్పు అంటుకుంది. వెంటనే సహచరులు ఆర్పివేయడంతో ఏఎస్సైకు గాయాలు కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, కులాన్ని ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటీ ఇన్‌ఛార్జి వి..అమృతపాణి డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ పీకా మాణిక్యరావు డిమాండ్ చేశారు. ఎన్ని జన్మలెత్తినాఎస్సీలుగానే పుడతామని జనంపార్టీ అధ్యక్షుడు తెనాలి రవిబాబు స్పష్టం చేశారు. మాదిగలు, మాలల మధ్య చిచ్చు పెట్టి విడదీసిన చంద్రబాబు ఎస్.సి లను కించ పరిచే విధంగా మాట్లాడిన తీరును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఖండించారు.
సీఎం చంద్రబాబునాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం నాయకుడు దుడ్డు మార్కు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ రాఘవులు, బి. రఘురామ్ డిమాండ్ చేశారు. ‘మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనౌతానని’ మహాకవి గురజాడ అప్పారావు చెప్పారని, దురహంకారపూరితంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై హెచ్‌ఆర్‌సీ సుమోటోగా కేసు నమోదు చేయాలని కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎస్సీలకు వెంటనే క్షమాపణ చెప్పాలని జిల్లా పంచాయితీల సర్పంచ్‌ల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎన్. పోతురాజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎస్సీ జాతీయ కమీషన్ సుమోటాగా స్వీకరించి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రముఖ న్యాయవాది ముప్పవరపు కిశోర్, ధర్మచక్ర ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాండ్ల హరిప్రసాదులు డిమాండ్ చేశారు.
చంద్రబాబు వాఖ్యలపై దళిత సంఘాల నిరసన
చీరాల: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులను కించపరిచేలా వాఖ్యలు చేయడంపై దళిత, గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. చీరాల్లో పలు, ప్రజా సంఘాల ఆద్వర్యంలో మంగళవారం గడియార స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వాఖ్యలకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి దళిత వ్యతిరేకి చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులు, ప్రజా సంఘాల నాయకుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.
అనంతరం దళిత, ప్రజా సంఘాలు పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రజా, దళిత సంఘాల నాయకులు ఎన్.మోహన్ కుమార్ ధర్మా, గోసాల ఆశీర్వాదం, బొనిగల జైసన్ బాబులు మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఎస్సీలను కించపరచడమేనని అన్నారు. పోలీసులు, కోర్టులు సుమోటోగా తీసుకుని సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పొదిలి ఐస్వామి, పులిపాటి రాజు, దడ్డు విజయ్‌సుందర్, శ్యామ్యేలు, భాస్కర్, లక్ష్మీనరసయ్య, సురేష్, బొనిగల పేతురుబాబు, మేడిద రత్నకుమార్, అశోక్, ఎస్‌డీ బాబు, మత్తయ్య తదితరులు ఉన్నారు.