ఆలయ అభివృద్ధికి సహకారం
చక్రాయపేట :
జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి వీరాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం గండి అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేసరి, రాజా ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర ఆయనకు వివరించారు.
దాతల సహకారంతో రూ.63 లక్షలతో జరుగుతున్న పర్మినెంటు షెడ్లు, డార్మెంటరీ, క్యూలైన్ల పనులపై ఆయన ఆరా తీశారు. ఆలయ ఆవరణలో తాము పెట్టుకున్న హోటళ్లు, తోపుడు బండ్లకు గాను ఆలయ అధికారులు వారానికి రూ.200 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆయనకు మొర పెట్టుకున్నారు.
దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారికి ఎంపీ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తే స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులకు పర్మినెంటు షెడ్లు వేయించి ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ మునికుమారి, మారెళ్లమడక, సురభి, సింగిల్ విండో ప్రెసిడెంట్లు శేషారెడ్డి, సురేష్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంటు మునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.